ఖమ్మం టౌన్, వెలుగు: రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడొచ్చని అడిషనల్ డీసీపీ(లాఅండ్ ఆర్డర్) ప్రసాద్‌రావు అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిటీలోని ఆర్ముడ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రామానుజం, అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రసాద్‌రావు మాట్లాడుతూ విధినిర్వహణలో ప్రజల కోసం ప్రాణాలిచ్చిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవాలన్నారు. అన్నిదానాల్లో కన్నా రక్తదానం గొప్పదన్నారు.
తలసేమియా చిన్నారి బాధితులకు రక్తాన్ని అందించేందుకు క్యాంపు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం 32 సార్లు రక్తదానం చేసిన ఎస్సై సుధాకర్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీలు రమణమూర్తి, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, సీఐలు బాలకృష్ణ, భానుప్రకాశ్, మోహన్ బాబు, సత్యనారాయణ, ఉస్మాన్ షరీఫ్, రాజిరెడ్డి, ఆర్ఐలు కామరాజు, శ్రీశైలం, సురేశ్, సాంబశివరావు, సంకల్పం తలసేమియా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ వేణుమాధవ్, ఆటో యునియన్ పాల్గొన్నారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో బాలికలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. వైరా మండలం ముసలిమడుగులోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో లో ఎస్సై రామారావు, మధిరలోని బీసీ గర్ల్స్ హాస్టల్‌లో సీఐ రమేశ్, కారేపల్లిలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు ఎస్సై గోపి అవగాహన కల్పించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్‌లో వైరా పోలీసులు పోక్సో, బాల్యవివాహాల నిర్మూలన చట్టంపై అవగాహన కల్పించారు.
