గవర్నమెంట్ స్కూల్లో టీచర్ల గొడవ!

గవర్నమెంట్ స్కూల్లో టీచర్ల గొడవ!
  • హెడ్మాస్టర్​ పై చెప్పుతో మహిళా టీచర్ దాడి 
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన 
  • ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి కలెక్టర్​ కు నివేదిక

ఖమ్మం టౌన్​/ ఖమ్మం, వెలుగు:  ఖమ్మం నగరంలోని జుబ్లీపురా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్టూడెంట్స్ ముందే హెడ్మాస్టర్​, మహిళా టీచర్​ గొడవ పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత వారం జరిగిన ఈ వివాదంలో హెడ్మాస్టర్​ బానోత్ శ్రీనివాస్ పై టీచర్ చెప్పుతో దాడి చేసినట్టుగా విద్యార్థులు చెబుతున్నారు. ఈ గొడవ గురించి తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్​తో పాటు మండల అధికారులు కూడా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. 

అయితే తనను వేధిస్తున్నారంటూ హెడ్మాస్టర్​ పై పోలీసులకు మహిళా టీచర్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మొత్తం వివాదంపై పూర్తి స్థాయి విచారణకు కలెక్టర్ ఆదేశించడంతో, శాఖాపరమైన విచారణ జరిపి నివేదిక అందజేశారు. తుఫాను, వరదల కారణం టీచర్ పై చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైనట్టు తెలుస్తోంది. మూడు నెలల కింద వర్క్ అడ్జెస్ట్ మెంట్ లో భాగంగా మహిళా టీచర్​ జూబ్లీపురా స్కూల్​ కు కేటాంచారు.

 1 నుంచి 5వ తరగతి వరకు పిల్లలకు ఇంగ్లీష్ లో టీచర్లు బోధించాల్సి ఉండగా, వృత్తి పరంగా పాతికేళ్ల అనుభవం ఉన్నప్పటికీ కనీసం ఇంగ్లీష్ పదాల స్పెల్లింగ్స్​ తప్పు పెడుతున్నారు. ఈ విషయాన్ని పేరెంట్స్ మీటింగ్ లో హెడ్మాస్టర్​ దృష్టికి కొందరు తీసుకెళ్లారు. దీనిపై మాట్లాడుతున్న సమయంలో వాగ్వాదం జరిగింది. అదే సమయంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఉషారాణి స్కూల్ తనిఖీకి వచ్చారు. అప్పుడు పిల్లలకు పాఠాలు, బోర్డ్ పై అక్షరాలు రాయాలని టీచర్ ను ఆదేశించడంతో ఆమెకు ఇంగ్లీష్ రాదనే విషయం బయటపడింది. దీంతో హెడ్మాస్టర్​ కావాలనే తనను కక్షపూరితంగా వేధిస్తున్నారంటూ ఆయన గల్లాపట్టుకొని, చెప్పుతో కొట్టడంతో విషయం పెద్దదయింది.

 దీంతో ఇరువురి మధ్య గొడవను సర్ది చెప్పేందుకు స్థానిక కార్పొరేటర్ చేసిన ప్రయత్నం  కూడా ఫెయిలైంది. మరోవైపు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ త్రీటౌన్​ పోలీసులకు హెడ్మాస్టర్​ పై మహిళా టీచర్​ ఫిర్యాదు చేశారు. అయితే పేరెంట్స్ ఈ గొడవ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, హెడ్మాస్టర్​ అలాంటి వారు కాదని వివరించడంతో మహిళా టీచర్​ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీస్​ కమిషనర్​ కు, ఇన్​చార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్​ శ్రీజకు మహిళా టీచర్ ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక అందించాలంటూ బీసీ గురుకులాల ఆర్సీవో జ్యోతిని ఆదేశించారు. నాలుగు రోజుల కింద ఇద్దరు టీచర్ల వివాదంపై విచారణ పూర్తి చేసి నివేదికను అందజేశారు. ఒకట్రెండు రోజుల్లో బాధ్యులపై యాక్షన్​ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.