ట్రంప్ కామెంట్లపై కేంద్రాన్ని నిలదీస్తం..ప్రస్తుత పరిస్థితులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి: ఖర్గే

ట్రంప్ కామెంట్లపై కేంద్రాన్ని నిలదీస్తం..ప్రస్తుత పరిస్థితులపై ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి: ఖర్గే

బెంగళూరు: భారత్, -పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం తానే చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కామెంట్లపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత్-, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు, సీజ్ ఫైర్ సహా తాజా పరిణామాలను చర్చించడానికి వెంటనే  ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "సీజ్ ఫైర్ విషయంలో ట్రంప్ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తున్నారు.  ఇది చాలా సున్నితమైన అంశం. అఖిల పక్ష సమావేశం జరిగినప్పుడు..అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? టెలిఫోన్ లో ఏమేమి చర్చించారు?  వంటి అన్నీ ప్రశ్నలపై చర్చిస్తాం" అని ఖర్గే తెలిపారు.

ట్రంప్ కు ప్రధానమంత్రి మోదీ లొంగిపోయారా అనే ప్రశ్నకు సమాధానంగా.. "ఇప్పుడు దీని గురించి మాట్లాడటం సరికాదు.అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని త్వరలో కేంద్రాన్ని కోరతాను. ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం" అని ఖర్గే అన్నారు. భారత్, పాకిస్తాన్ దేశాలు శనివారం సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో ఎటువంటి మూడో పక్షం పాల్గొనలేదని భారత ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కానీ, వాణిజ్య సంబంధాల్ని నిలిపివేస్తామని తాను బెదిరించడం వల్లే ఇరుదేశాలు సీజ్ ఫైర్ ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్ చేశారు.