డిజిటల్ ఇండియాతో చెప్పుకోదగ్గ విజయాలేం లేవు: మల్లికార్జున్ ఖర్గే

డిజిటల్ ఇండియాతో చెప్పుకోదగ్గ విజయాలేం లేవు: మల్లికార్జున్ ఖర్గే
  • డిజిటల్ ఇండియాను ప్రశంసిస్తూ మోదీ చేసిన కామెంట్లకు ఖర్గే కౌంటర్

న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా స్కీమ్ ప్రవేశపెట్టి10 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్కీమును ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. డిజిటల్ ఇండియా చెప్పుకోదగ్గ గొప్ప విజయాలను ఏమీ సాధించలేదని..అది పూర్తిగా విఫలమైందని తెలిపారు. ఈ స్కీమ్ లక్ష్యాలు ఇప్పటికీ నెరవేరలేదని..లక్ష్యాల సాధన గడువును  గత11 ఏండ్లలో 8 సార్లు మార్చారని విమర్శించారు.

మంగళవారం ఖర్గే ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. " భారత్‌‌‌‌నెట్ ప్రాజెక్ట్‌‌‌‌లో 6.55 లక్షల గ్రామాలకు బ్రాడ్‌‌‌‌బ్యాండ్ అందించాల్సి ఉంది. కానీ 65% గ్రామాలు ఇంకా కవర్ కాలేదు. ఈ లక్ష్య సాధన గడువును 11 ఏండ్లలో 8 సార్లు మార్చారు. దేశంలోని కేవలం 766 గ్రామ పంచాయతీలలోనే వై-ఫై సేవలు అందుబాటులో ఉన్నాయి.  

ప్రైవేట్ కంపెనీలు 5జీలో  ఉంటే..భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఇంకా లక్ష 4జీ టవర్ల నిర్మాణ లక్ష్యాన్ని కూడా పూర్తి చేయలేదు. పైగా దాని అప్పులు రూ.23,297 కోట్లకు పెరిగాయి. అలాగే..మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) అప్పులు రూ.33,568 కోట్లకు చేరాయి" ఖర్గే వివరించారు.

54% స్కూళ్లకు ఇంటర్నెట్ లేదు 

దేశంలో 15 ఏండ్లు పైబడిన 75.3% మందికి ఇప్పటికీ కంప్యూటర్ ఉపయోగించడం తెలియదన్న ఖర్గే.. గ్రామీణ ప్రాంతాల్లో 81.9%, సిటీల్లో 60.4% మందిలో డిజిటల్ స్కిల్సే లేవని చెప్పారు. "దేశంలోని 54% ప్రభుత్వ స్కూళ్లకు ఇంటర్నెట్ లేదు. 79%కి పైగా స్కూళ్లల్లో కంప్యూటర్లు, 85%కి పైగా స్కూళ్లలో ప్రొజెక్టర్లు, 79%కి పైగా స్కూళ్లల్లో స్మార్ట్ క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లు లేవు.సైబర్ నేరాలు కూడా గడిచిన నాలుగేండ్లల్లో76.25% పెరిగాయి.

డిజిటల్ అరెస్ట్ స్కామ్‌‌‌‌లు మూడు రెట్లు పెరిగాయి. నోటు రద్దు నగదు లావాదేవీలను తగ్గిస్తుందన్నారు. కానీ ఇప్పుడు నగదు లావాదేవీలే పెరిగాయి. ఆధార్ షరతు వల్ల 7 కోట్ల మంది ఉపాధి కార్మికులను తొలగించారు. ఆధార్, యూపీఐలను యూపీఐ ప్రభుత్వమే ప్రారంభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ 2009), ప్రత్యక్ష హస్తాంతర లాభ్(పహల్2013) స్కీమ్ లను మేమే తెచ్చాం. ఈ ఘనత మాది! " అని ఖర్గే పేర్కొన్నారు. మోదీ సర్కార్ వైఫల్యాలు, మోసాల గురించి ఆలోచించాలని ప్రజలను కోరారు.