బ్యాట్పై ధోని పేరు రాసుకుని జట్టును గెలిపించింది

బ్యాట్పై ధోని పేరు రాసుకుని  జట్టును గెలిపించింది

మహేంద్ర సింగ్ ధోని...క్రికెట్ ప్రపంచంలో ఈ పేరంటే  ఓ సెన్సేషన్. ముఖ్యంగా భారత క్రికెట్లో ఈ పేరు ఒక ఇన్ స్పిరేషన్. క్రికెటర్గా, కెప్టెన్ గా, భారత క్రికెట్లో ధోని తనదైన ముద్ర వేశాడు. అందుకే  ధోనిని ఈ తరం క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుంటారు. ధోని జట్టులో ఉండే ఆటగాళ్లకు కొండంత అండ. ధోని గ్రౌండ్లో ఉంటే ఆ జట్టుకు ఎంతో భరోసా.  ధోని పేరు తలుచుకుంటేనే క్రికెటర్లకు ధైర్యం. అందుకే కొంత మంది క్రికెటర్లు తమ టీషర్టులు, బ్యాట్లపై ధోనిపేరును రాసుకుంటారు. తాజాగా జరుగుతున్న మహిళల ప్రీమియర్ లీగ్లో యూపీ వారియర్జ్ బ్యాటర్ కిరణ్ నవ్ గిరే తన బ్యాట్పై MSD 07 అని రాసుకుంది. గుజరాత్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ దృశ్యం కెమెరా కంట పడటంతో వైరల్ అయింది. 

ధోని పేరు రాసుకుంది జట్టును గెలిపించింది...

MSD 07 అని రాసుకున్న కిరణ్ నవ్ గిరే..అదే బ్యాట్తో బ్యాటింగ్ చేసింది. ఫోర్లు సిక్సర్లతో ధోని లాగే చెలరేగి ఆడింది. గెలుపు బాధ్యతను భుజాన వేసుకుని  చివరి వరకు క్రీజులో నిలబడి జట్టును విజతీరాలకు చేర్చింది. మొత్తంగా కిరణ్ నవ్ గిరే 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేయడంతో యూపీ వారియర్జ్..మరో బంతి మిగిలుండగానే 170 పరుగుల లక్ష్యాన్ని  ఛేధించింది. 

స్టార్గా మారిన కిరణ్..

ధోని పేరును బ్యాట్పై రాసుకుని జట్టును గెలిపించిన కిరణ్ నవ్ గిరే రాత్రికి రాత్రే స్టార్ అయింది. ఆమె ఆడిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు 28 ఏళ్ల కిరణ్ ప్రభు నవ్ గిరే..మహారాష్ట్రలోని షోలాపూర్లోని ఓ పేద కుటుంబంలో జన్మించింది. ప్రస్తుతం నాగాలాండ్కు ఆడుతున్న నవ్ గిరే..టీ20 ఛాలెంజ్లో వెలాసిటీ టీమ్కు ప్రాతినిధ్యం వహించింది. అటు టీ20ల్లో నవ్ గిరేకు 162 వ్యక్తిగత స్కోరు సాధించడం విశేషం. టీ20 ట్రోఫీ 2022లో అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లు కిరణ్..162 పరుగులు సాధించింది. 

 యూపీ వారియర్జ్ విజయం..

ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్..20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.  హరీన్ డియోల్ 32 బంతుల్లో, ఏడు ఫోర్లతో 46 పరుగులు చేయగా..ఓపెనర్ సబ్బినేని మేఘన 24 పరుగులు, గార్డెనర్ 25 పరుగులు, దయాళన్ హేమలత 21 పరుగులతో రాణించారు.  యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అంజలీ శర్వాని, తహ్లియా మెక్ గ్రాత్ ఒక్కో వికెట్ తీశారు.  ఆ తర్వాత 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్జ్..19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175  పరుగులు చేసింది. కిరణ్ నేవ్ గిర్  43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు సాధించింది.  గ్రేస్ హార్రిస్ 26  బంతుల్లో 7 ఫోర్లు, 3  సిక్సర్లతో 59  పరుగులు చేసి చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించింది. ఆమెకు  సోఫియా 12 బంతుల్లో ఓ సిక్సు, ఓ ఫోర్తో 22 పరుగులు చేసి సహకరించింది. గుజరాత్ బౌలర్లలో కిమ్ గార్త్ 5 వికెట్లు తీయగా..అన్నాబెల్ సుదర్లాండ్ , మాన్సి జోషీ ఒక్కో వికెట్ పడగొట్టారు.