తెలంగాణలో విత్తనాలకు కొరత లేదు :కోదండరెడ్డి

తెలంగాణలో విత్తనాలకు కొరత లేదు :కోదండరెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పత్తి విత్తనాలకు కొరత లేదని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. విత్తనాల అంశంపై ప్రభుత్వం నెల రోజుల ముందే రివ్యూ చేసి 55 లక్షల ఎకరాలకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాలకు పత్తి విత్తనాలు సరఫరా అయ్యాయని చెప్పారు. ప్రతి కంపెనీకి చెందిన విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

 ఈ మేరకు గురువారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పత్తి విత్తనాల విషయంలో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు విత్తనాలు దొరకవనే ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. గత ప్రభుత్వంలో నకిలీ విత్తనాల విక్రయదారులు మీద కేసులు పెట్టలేదని, ఇప్పుడు కేసులు బుక్ చేస్తున్నామని వివరించారు.