నషా ముక్త్ భారత్ పాదయాత్ర.. హైదరాబాద్ లోని ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్

నషా ముక్త్ భారత్ పాదయాత్ర.. హైదరాబాద్ లోని ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్స్

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నేటి(నవంబర్ 25) నుంచి వాహనాల రాకపోకలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. 'నషా ముక్త్ భారత్' కార్యక్రమంలో భాగంగా కిషన్ రెడ్డి ఈ పాదయాత్ర నిర్వహించనున్నారు.

అంబర్‌పేట్ నుంచి ముషీరాబాద్‌లోని కాశీ ఫంక్షన్ హాల్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అంబర్‌పేట్, రామంతాపూర్, గోల్నాక ప్రాంతాల్లో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించనున్నారు.

అలాగే ఫీవర్ ఆసుపత్రి, తిలక్‌నగర్, హిమాయత్‌నగర్ మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. తార్నాక, విద్యానగర్, మెట్టుగూడ ప్రాంతాలతో పాటు చిలకలగూడ, పద్మారావునగర్, గాంధీ ఆసుపత్రి పరిసరాల్లో వాహనాల రాకపోకలకు మళ్లింపులు ఉంటాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్‌నగర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు.

పాదయాత్ర జరిగే మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ రహదారులను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.