
- టైం, డేట్, ప్లేస్ డిసైడ్ చేసి చెప్తే నేనే వస్తా
- కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం చేస్తా అన్నరు
- కేసీఆర్ తన ఫ్యామిలీతో వెళ్లి సోనియా కాళ్లు మొక్కారని విమర్శ
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని, ఏనాడూ బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారం పంచుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. 2013లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీని విలీనం చేస్తానని కుటుంబ సమేతంగా కేసీఆర్.. సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ల పొత్తుపై ఢిల్లీ, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని సవాల్ విసిరారు. లేదంటే టైం, డేట్, ప్లేస్ డిసైడ్ చేయాలని, తాను చర్చకు వస్తానన్నారు. 2014, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కట్టగట్టుకొని బీఆర్ఎస్లో చేరారన్నారు. ఇవేమీ తెలియక.. తెలంగాణ పర్యటనలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ లీడర్లు రాసిచ్చిన పేపర్ రాహుల్ చదువుతున్నారని ఫైర్ అయ్యారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. సీఎల్పీ నేతతో పాటు సీఎల్పీనే బీఆర్ఎస్లో విలీనం అయిందన్నారు. పవర్ కోసం ఏండ్లుగా కలలు కంటూ.. వాస్తవాలు మరిచిపోయారని, జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో బీఆర్ఎస్ చేరిన విషయం రాహుల్ కు తెలియదా? కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిని చేసిన విషయం రాహుల్ మరిచారా?’’అని విమర్శించారు. మోసాలు చేయడం కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. ‘‘2004లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఢిల్లీ, హైదరాబాద్ లో అధికారం పంచుకున్నారు. కనీస రాజకీయ అవగాహన లేని వ్యక్తి రాహుల్. అబద్ధాలే వారి జీవితం. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఎవరితో ఎవరు కలిశారు?’’అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇవేమీ తెలియని అమాయకులు తెలంగాణ ప్రజలు కాదన్నారు.
రేవంత్‌ను కాపాడుతున్నది కేసీఆరే..
ఓటుకు నోటు కేసులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కేసీఆరే కాపాడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసు ఎందుకు తొక్కిపెట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరిని ఎవరు కాపాడుతున్నారో ప్రజలకు అర్థం అవుతున్నదన్నారు. మజ్లిస్ పార్టీని మధ్యవర్తిగా పెట్టుకొని బీఆర్ఎస్, కాంగ్రెస్ పని చేస్తున్నాయని విమర్శించారు. ఈ మూడు పార్టీల డీఎన్ఏ ఒక్కటే అని ఫైర్ అయ్యారు. ఎవరు ఎవరికి బీ టీం.. ఎవరికి ఓటు వేస్తే.. ఎవరికి వెళ్తుందో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లు చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ వద్ద రక్తం కారే దాకా ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో బీజేపీలో పెద్దఎత్తున చేరికలు ఉంటాయన్నారు. ‘ముందుంది ముసుళ్ల పండుగ’అని చెప్పారు. రాజాసింగ్ వ్యవహారం పార్టీ అంతర్గత అంశమని, సస్పెన్షన్ ఎత్తేస్తే పోటీలో ఉంటారని పేర్కొన్నారు.