- వాటి రక్షణ బాధ్యత గోపరిరక్షకులదే కాదు.. మొత్తం సమాజానిది
- గోవిజ్ఞాన అవార్డుల ప్రదానోత్సవంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: గోవును కాపాడితే ప్రకృతిని కాపాడినట్టేనని, గోమాత సేవల గురించి పాఠ్యాంశాల్లో చేర్చాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అన్నారు. గోవుల రక్షణ బాధ్యత గోపరిరక్షులదే కాదని, మొత్తం సమాజానిదన్నారు.
ఆదివారం హైదరాబాద్‌లోని కేఎంఐటీలో తెలంగాణ ప్రాంత గోవిజ్ఞాన అవార్డుల ప్రదాన కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన తన నివాసంలో గోవులతో గడిపే సమయం మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెప్పారని వెల్లడించారు.
గోవుల ఉత్పత్తుల ప్రాధాన్యత గురించి చాలా మందికి తెలియదన్నారు. సౌదీ అరేబియాలాంటి దేశాలు కూడా గోవుల ఉత్పత్తులను వాడుతున్నాయని చెప్పారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. గోసంతతిని కాపాడుకోవడం మత విశ్వాసం కానేకాదని, సైన్స్ అంగీకరించిన వాస్తవమన్నారు.
గోమూత్రం, పాలు, పెరుగు, నెయ్యి సహా గోవు నుంచి వచ్చే ప్రతి ఉత్పత్తి పర్యావరణానికి అత్యంత అనుకూలమైనదేనని, ప్రకృతి సమతుల్యతను కాపాడుతుందని చెప్పారు. గోవులు తగ్గిపోవడం వల్లే రైతులు రసాయన ఎరువులను అధికంగా వాడుతున్నారని, దీంతో పంటలు విషతుల్యమై, చివరికి మనం తినే తిండి కెమికల్స్‌తో నిండిపోతోందన్నారు.
