
తెలంగాణ బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. కిషన్ రెడ్డి గురువారమే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం క్యాబినెట్ సెక్రటరీ మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి శాఖలు కేటాయించారు. దక్షిణా రాష్ట్రమైన తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డిని హోంశాఖ వరించడం విశేషం. కేంద్ర మంత్రిగా తనపై ఉంచిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని గురువారం ఢిల్లీలో ప్రమాణం స్వీకరించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి ప్రకటించారు.
తనపై నమ్మకముంచిన ప్రధానమంత్రి మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ఐదేండ్లూ దేశాభివృద్ధి కోసం ఆయన నేతృత్వంలో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదంతో ముందుకువెళతామని చెప్పారు. పార్టీలో అహర్నిశలు కృషిచేసినవారికి పెద్దపీట వేశారన్న ఆయన.. రెండు తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.