
- హైదరాబాద్ ప్రాపర్టీ షో’లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రానున్న రోజుల్లో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కు మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ట్రిపుల్ ఆర్, మెట్రో వంటి ప్రాజెక్టులతో కొత్త అవకాశాలు వస్తాయన్నారు. హైదరాబాద్ లో క్రెడాయ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ‘హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025’ ముగింపు కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రెరా చట్టం వల్ల రియల్ ఎస్టేట్‌పై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. సొంతింటి కల కోరిక మాత్రమే కాదని, అదొక ఎమోషన్ అని పేర్కొన్నారు.
ఆ కలను నెరవేర్చే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రియల్ ఎస్టేర్లపైనా ఉందన్నారు. హైదరాబాద్‌ను వ్యాక్సిన్ రాజధానిగా అభివర్ణించారు. ఫార్మా, ఐటీ, హెల్త్‌కేర్, సీడ్ ఎగుమతుల్లో నగరం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రూ.25 వేల కోట్ల రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైలు, మెట్రో విస్తరణ వంటి మెగా ప్రాజెక్టులు నగర కనెక్టివిటీని పెంచి కొత్త అభివృద్ధి అవకాశాలు కల్పిస్తాయన్నారు. వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణ, ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని కమర్షియల్‌గా మార్చే ప్రయత్నాలు రాష్ట్రానికి లాభం చేకూరుస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు. మెట్రో ప్రాజెక్టులు రవాణా వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా వాటి చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వీలు కల్పిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు జయదీప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కాంతి కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాగా.. తదుపరి హైదరాబాద్ ప్రాపర్టీ షో– 2026 వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు.
ప్రాపర్టీ షో సక్సెస్: క్రెడాయ్
దేశవ్యాప్తంగా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల అగ్ర సంఘం క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో మూడు రోజుల పాటు నిర్వహించి ‘ హైదరాబాద్ ప్రాపర్టీ షో 2025’ సక్సెస్ అయినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రాపర్టీ షో ఆదివారం ముగిసింది. ఈ మూడు రోజుల ప్రదర్శనలో 50 వేల మందికి పైగా సందర్శకులు పాల్గొన్నారని. 70కి పైగా ప్రముఖ డెవలపర్లు, 300కిపైగా రెరా అనుమతితో ఉన్న అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ ప్రాజెక్టులను ప్రదర్శించినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ మూడు రోజుల్లో రూ.400 కోట్లకు పైగా వ్యాపారాన్ని ఈ ప్రాపర్టీ షో సాధించిందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజుల ప్రదర్శనలో 23,000కుపైగా క్వాలిఫైడ్ లీడ్స్, 185 సైట్ సందర్శనలు, 35 ఆన్-ది-స్పాట్ సేల్స్ నమోదైనట్టు తెలిపారు. మొత్తం 140 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని డెవలపర్లు ప్రదర్శించారు.