ఏ మొఖం పెట్టుకొని ఓట్లడుగుతరు? జూబ్లీహిల్స్‌‌ అభివృద్ధికి బీఆర్‌‌‌‌ఎస్‌‌, కాంగ్రెస్ ఏం చేసినయ్?: కిషన్‌‌రెడ్డి

ఏ మొఖం పెట్టుకొని ఓట్లడుగుతరు? జూబ్లీహిల్స్‌‌ అభివృద్ధికి బీఆర్‌‌‌‌ఎస్‌‌, కాంగ్రెస్ ఏం చేసినయ్?: కిషన్‌‌రెడ్డి
  • డబుల్ బెడ్రూం ఇండ్లు ఇయ్యకుండా బీఆర్ఎస్‌‌ మోసం చేసింది
  • బంగారు తెలంగాణ కాదు.. కుటుంబాన్ని  బంగారం చేసుకున్నరు
  • రెండేండ్లైనా కాంగ్రెస్​ ఒక్క హామీని నెరవేర్చలే​
  • జూబ్లీహిల్స్​ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని వెల్లడి


జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌‌లో ఇంతకుముందు గెలిచిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​, కాంగ్రెస్​పార్టీలు ఈ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలను ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ, యూసఫ్‌‌‌‌గూడ డివిజన్లలో కిషన్‌‌‌‌రెడ్డి ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపీ పోరాడిందని, కానీ..  రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్లపాటు కేసీఆరే పాలించారని అన్నారు. 

ఆయన తెలంగాణ ప్రజలను బానిసలుగా చూశారని, తెలంగాణను బంగారం చేస్తానని చెప్పి,  తన కుటుంబాన్ని మాత్రమే బంగారం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాటిచ్చి.. వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్యోగాలు కల్పించుకున్నారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పి.. పదేండ్లపాటు ప్రజలను మోసం చేశారని, కానీ వారి కుటుంబం మాత్రం విలాసవంతమైన ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు కట్టుకున్నదని తెలిపారు. ‘‘ఈ రోజు జూబ్లీహిల్స్ కాలనీల్లో మురుగునీరు ఏరులై పారుతున్నది. మున్సిపల్ మంత్రిగా ఉండి కేటీఆర్  ఏం చేశారు? ” అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ​వచ్చినా మార్పు రాలే 

బీఆర్ఎస్ ​జెండా పోయి.. కాంగ్రెస్​ జెండా వచ్చినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని కిషన్‌‌‌‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నా ఒక్క హామీనైనా నెరవేర్చలేదని పేర్కొన్నారు. మహిళలకు రూ.2,500, విద్యార్థులకు ఉచిత స్కూటీలు, నిరుద్యోగ యువతకు రూ. 4 వేల భృతిలాంటి హామీలను మరిచిందన్నారు. బీసీ సంక్షేమానికి కేటాయించిన లక్ష కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముస్లింలు కాంగ్రెస్​ పార్టీకి ఇజ్జత్ అని అంటున్నారని, మరి హిందువులకు గౌరవం లేదా?  అని అడిగారు.