
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అనుకుంటే ఎలా అని, అది ప్రజలు అనుకోవాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల ఆలోచన వేరే ఉందని తెలిపారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అలయ్ బలయ్ ప్రోగ్రాంకు వచ్చిన కిషన్ రెడ్డి.. రాజ్‌గోపాల్ రెడ్డి రాజీనామాపై స్పందించారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, ఎవరి ఊహలు వారివి అని అన్నారు. ఎవరు ఏంటి అనేది ప్రజలే తేల్చుతారని చెప్పారు.
మంచి హోదా ఇచ్చినం: లక్ష్మణ్
రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయ స్థాయిలో హోదా కల్పించిందని, అలాంటి బీజేపీని ఉద్దేశిస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం సరికాదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయి లీడర్ల సమక్షంలో బీజేపీలో చేరి.. ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదన్నారు. రాజగోపాల్ రెడ్డిని పార్టీ ఎంతో గౌరవించిందన్నారు. వ్యక్తిగతంగా ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు.
రాజ్‌గోపాల్ రెడ్డి.. పాసింగ్ క్లౌడ్: జితేందర్ రెడ్డి
రాజ్‌గోపాల్ రెడ్డి అనే వ్యక్తి పాసింగ్ క్లౌడ్ అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. అలయ్ బలయ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఎప్పుడూ బలంగా ఉంటుందన్నారు. కొందరు అలా వచ్చి.. ఇలా వెళ్లినా.. నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నట్లు వివరించారు.