కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగానే ఓడిపోయామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఒక తప్పు చేస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్ వంద తప్పులు చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రజలు ఓట్లు వేస్తారని అన్నారు.
కర్ణాటక ప్రజల తీర్పును శిరసావహిస్తామని చెప్పారు కిషన్ రెడ్డి. తప్పులను సరిచేసుకుని లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందన్నారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వం వ్యతిరేకత వల్లే తాము ఓడిపోయామన్నారు. తమ లోపాలను సరిదిద్దుకుని తొందర్లోనే ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో బీఆర్ఎస్ కు బాగా ధైర్యం వస్తోందన్న ప్రచారం ఒట్టిదేనన్నారు కిషన్ రెడ్డి.
ఇక ఇప్పటి వరకు కాంగ్రెస్ 73 స్థానాల్లో విజయం సాధించగా మరో 63 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 34 స్థానాల్లో గెలవగా.. మరో 30 స్థానాల్లో లీడ్ లో ఉంది. జేడీఎస్ 13 స్థానాల్లో గెలవగా మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.