
- హామీలు నెరవేర్చకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్
- బీజేపీలో చేరిన పాలకుర్తి బీఆర్ఎస్ జడ్పీటీసీ సంధ్యారాణి
- బీఆర్ఎస్ను ఓడించేందుకే బీజేపీలోకి వలసలు: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ప్రజాబలం కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని కేసీఆర్ సర్కార్ పై ఆయన మండిపడ్డారు. బుధవారం బీజేపీ స్టేట్ఆఫీస్లో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి (బీఆర్ఎస్) తో పాటు ఆమె అనుచరులు, పెద్దపల్లి, రామగుండంకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబుల్ బెడ్రూం ఇండ్లు, రైతు రుణమాఫీ, దళిత బంధు, గిరిజన బంధు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను నెరవేర్చకుండా పూర్తి అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారని ఫైర్అయ్యారు. అన్ని రంగాల్లో విఫలమైన బీఆర్ఎస్ సర్కారు.. మళ్లీ ఓట్లు ఎలా అడుగుతోందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో యువత, ప్రజలు నిశ్శబ్ద వాతావరణంలో రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి.. బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు.
రాహుల్.. ఏ మొహం పెట్టుకుని వచ్చిండు
రాహుల్, ప్రియాంక ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని కిషన్రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయం జరిగిందని, అందుకే తెలంగాణ ఉద్యమం మొదలైందన్నారు. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ చేసిన ఆలస్యం కారణంగానే 1,200 మంది విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమని, అలాంటి పార్టీ నాయకులకు తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని, ఆ పార్టీలను తెలంగాణ సమాజం ఓడించి కుటుంబ, అవినీతి పార్టీల పీడను వదిలించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రభుత్వం నీతివంతమైన పాలనను అందిస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. వారి మద్దతు కూడగట్టి స్టేట్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీజేపీలో చేరడాన్ని ఆహ్వానిస్తూ ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.
బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది: సంధ్యారాణి
బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం ఆనందంగా ఉందని జడ్పీటీసీ సంధ్యారాణి అన్నారు. తెలంగాణకు పట్టిన గ్రహణం వీడీ, సుపరిపాలన అందాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి, పూలే ఆశయాల సాధన దిశగా ముందుకెళ్తానన్నారు. బీజేపీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం తీసుకొచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి మహిళలంతా మద్దతు తెలపాలని ఆమె కోరారు.