ఆ అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు: కిషన్ రెడ్డి

ఆ అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్,వెలుగు :  కొందరు ప్రశ్నించినంత మాత్రాన జవాబు చెప్పాల్సిన అవసరం తనకు లేదని,  ప్రజలకు, మీడియాకే చెప్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తే రాలేని బీఆర్ఎస్ నేతలకు తన  గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ వారాసిగూడలో బీజేపీ ఆఫీసును ఆయన ప్రారంభించారు. అనంతరం సీతాఫల్ మండి మీదుగా జీపు ప్రచార యాత్రను కొనసాగించారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో  రాష్ట్రాన్ని, సికింద్రాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నో ఉత్తరాలు రాసినా స్పందించలేదన్నారు. అది ఒక నియంతృత్వ మూర్ఖుల ప్రభుత్వమని  విమర్శించారు. సికింద్రాబాద్ తో పాటు రాష్ట్రంలో అధిక స్థానాల్లో  బీజేపీ  గెలిచి దేశవ్యాప్తంగా 400 పైగా సీట్లు కైవసం చేసుకొని మూడోసారి ప్రధానిగా మోదీ అధికారం చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధి శారద మల్లేష్, కృష్ణమూర్తి, హరి, సారంగపాణి, కందాడి నాగేశ్వర్ రెడ్డి, సీతాఫల్ మండి డివిజన్ అధ్యక్షుడు రాజేశ్వరరావు, రాంవర్మ పాల్గొన్నారు.