హైటెక్​ సిటీని.. ఓల్డ్ ​సిటీని ఒకేలా చూడాలి: కిషన్ రెడ్డి

హైటెక్​ సిటీని.. ఓల్డ్ ​సిటీని ఒకేలా చూడాలి: కిషన్ రెడ్డి
  • అభివృద్ధి అంటే హైటెక్ ​సిటీ మాత్రమే కాదు
  • దిశ మీటింగులో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ మాత్రమే కాదని.. ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ కీలకమని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీ అని చెప్పారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్​లో నిర్వహించిన దిశ(జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ) సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సిటీ అభివృద్ధిలో, మౌలిక సదుపాయాల కల్పనలో జీహెచ్ఎంసీ, వాటర్​బోర్డు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆయా శాఖలకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ సమస్యలు బస్తీల్లో ఎక్కువగా కనబడుతున్నాయని, అవసరమైన ప్రతిచోట స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ విస్తరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 

రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పూర్తిస్థాయి సమాచారాన్ని సమర్పించాలన్నారు. పాతబస్తీలోని చాలా ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవన్నారు. హైటెక్ సిటీని, ఓల్డ్ సిటీని సమాన దృష్టితో చూడాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ ను అన్ని ప్రాంతాలకు సమానంగా ఉపయోగించాలన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేయించేందుకు సహకరిస్తానని కిషన్​రెడ్డి హామీ ఇచ్చారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అప్జల్‌‌‌‌‌‌‌‌గంజ్ వరకే పరిమితమైన ఫస్ట్ ఫేజ్‌‌‌‌‌‌‌‌ను విస్తరించి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్‌‌‌‌‌‌‌‌ల కోసం ప్రతిపాదనలు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఆ వివరాలు అందితే కేంద్రం నుంచి అవసరమైన నిధులు, రుణాలు లభించేలా సహకరిస్తానన్నారు. దిశ మీటింగులో కేంద్ర నిధులతో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్షించినట్టు కిషన్​రెడ్డి తెలిపారు. 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముద్ర రుణాల కోసం మొదటిసారి దరఖాస్తు చేసినవారిలో ఎంతమందికి రుణాలు మంజూరయ్యాయో అధికారులను ప్రశ్నించారు. పూర్తినివేదిక అందజేయాలని ఆదేశించారు.