సైట్ విజిట్’ రూల్ కొత్తదేమీ కాదు..నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది: కిషన్ రెడ్డి

సైట్ విజిట్’ రూల్ కొత్తదేమీ కాదు..నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది: కిషన్ రెడ్డి
  • నైనీ కోల్​ బ్లాక్​ టెండర్లపై విచారణ మొదలైంది: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి 
  • సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించాలి.. 
  • క్వాలిటీ కోల్​ తవ్వి తీయాలి
  • కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తేనే సింగరేణికి మంచి భవిష్యత్తు​
  • కొత్తగూడెంలోని ఇల్లెందు క్లబ్‌‌‌‌లో సింగరేణి ఆఫీసర్లు, 
  • కాంట్రాక్టర్లతో మూడున్నర గంటలపాటు  మీటింగ్​
  • --రాష్ట్ర ప్రభుత్వంపై గుడ్డిగా ఆధారపడొద్దంటూ సూచన

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి సైట్​ విజిట్​ విషయంలో జరుగుతున్న ఆరోపణలను పరిశీలిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి  కిషన్‌‌‌‌రెడ్డి చెప్పారు. ‘సైట్​ విజిట్’​ అనే నిబంధన కొత్తదేమీ కాదని పేర్కొన్నారు. ఇకపై సైట్​విజిట్ ​సెల్ఫ్ డిక్లరేషన్.. జియో ట్యాగింగ్​ ద్వారానే  ఇచ్చే విధంగా ప్లాన్​ చేస్తున్నామని చెప్పారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించి, క్వాలిటీ కోల్​ తవ్వి తీసేలా చర్యలు తీసుకోవాలని సంస్థ అధికారులను ఆదేశించారు. సింగరేణి తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నదని,  వీటిని అధిగమించాలంటే కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా పని చేయాలన్నారు. అప్పుడే సంస్థకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. 

సింగరేణిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఇందుకోసం కొత్తగా 8  కోల్​ బ్లాకులను ఎక్స్​టెన్షన్​ చేసుకోవాలని చెప్పారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి ఇల్లెందు క్లబ్‌‌‌‌లో సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు, పలు శాఖల హెచ్‌‌‌‌వోడీలతో శనివారం కిషన్‌‌‌‌రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం కాంట్రాక్టర్లతోనూ సమీక్షించారు. మీడియాతో మాట్లాడారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు లభ్యతపై జియోలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా, సింగరేణి ఎక్స్‌‌‌‌ప్లోరేషన్​ డిపార్ట్‌‌‌‌మెంట్​ కలిసి సర్వే నిర్వహించేలా ప్లాన్​ చేస్తున్నామని తెలిపారు. 

సత్తుపల్లి, కోయగూడెం ఓసీలు గతంలో ప్రైవేట్​ సంస్థలు దక్కించుకున్నాయని, అప్పుడు సింగరేణి వేలంలో పాల్గొని ఉంటే సంస్థకు వచ్చేవన్నారు. ఇప్పటికైనా ఆ ఓసీలపై సింగరేణి ఫాలోఅప్​ చేసుకోవాలని సూచించారు. ఏండ్లుగా సింగరేణి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నదని, దీని భవిష్యత్​ దృష్ట్యా సరైన ట్రాక్​లో పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసి కొత్తగూడెంలో మీటింగ్​పెట్టామన్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించడంతోపాటు క్వాలిటీ బొగ్గు అందించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని చెప్పారు. పోటీ ప్రపంచంలో తక్కువ ధరకే బొగ్గు దొరుకుతున్న క్రమంలో సింగరేణి తన ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

ఇటీవలి కాలంలో పత్రికల్లో సింగరేణికి సంబంధించి వస్తున్న వార్తలను పరిశీలిస్తున్నామని, నైనీ కోల్​బ్లాక్​ టెండర్ల విషయమై విచారణ మొదలైందని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్ర బొగ్గు గనుల శాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చిందని చెప్పారు.  

దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతున్నాం.. 

దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచి, విదేశాల నుంచి కోల్​ దిగుమతులను జీరో చేయడమే లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తున్నదని కిషన్‌‌‌‌రెడ్డి తెలిపారు. దేశంలో బొగ్గు ఉత్పత్తులు పెంచడం,  బొగ్గు దిగుమతులు తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తున్నదని, ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 60 వేల కోట్ల మేర ఆదా అయిందన్నారు.  దేశంలో ఒకప్పుడు విద్యుత్​ కొరత తీవ్రంగా ఉండేదని, బొగ్గు ఉత్పత్తి పెరుగుతుండడం వల్ల దేశంలో ప్రస్తుతం ఎక్కడా ఆ సమస్య లేదని చెప్పారు. దేశంలో 74 శాతం థర్మల్​ విద్యుత్​ కేంద్రాల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నదని వెల్లడించారు.  

సింగరేణి చరిత్రలో తొలిసారిగా..

136 ఏండ్ల సింగరేణి చరిత్రలో తొలిసారిగా కొత్తగూడెంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి రివ్యూ చేయడం చర్చనీయాంశంగా మారింది. శనివారం సాయంత్రం కొత్తగూడెంలోని  సింగరేణి భవన్‌‌‌‌కు చేరుకున్న కిషన్‌‌‌‌రెడ్డి.. సీఎండీతో పాటు డైరెక్టర్లు, పలు శాఖల హెచ్‌‌‌‌వోడీలతో రాత్రి 10.30 గంటల వరకు సమీక్షించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోల్​, ఓబీ కాంట్రాక్టర్లతోనూ చర్చించడం గమనార్హం.  రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు పోవద్దని,  రాష్ట్రంతోపాటు కేంద్రంతోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తూ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నుంచి రూపేందర్​ బ్రార్​, సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, డైరెక్టర్లు గౌతమ్​ పొట్రు, కొప్పుల వెంకటేశ్వర్లు, ఎల్వీ సూర్యానారాయణ, తిరుమల రావుతో పాటు పలు శాఖల హెచ్‌‌‌‌వోడీలు పాల్గొన్నారు.