సర్వేల్లో నిజం లేదు.. జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదు: కిషన్ రెడ్డి

సర్వేల్లో నిజం లేదు.. జూబ్లీహిల్స్ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదు: కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం  
  • అధికార పార్టీకి మేలు చేసేందుకే కేసీఆర్ ప్రచారానికి రావట్లే 
  • బీసీ రిజర్వేషన్లను కాదు.. ముస్లిం రిజర్వేషన్లనే వ్యతిరేకిస్తున్నం
  • హైదరాబాద్‌‌‌‌కు భారీగా నిధులు తెచ్చానని వ్యాఖ్య

హైదరాబాద్​సిటీ, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములపై వస్తున్న సర్వేల్లో నిజం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘జూబ్లీహిల్స్‌‌‌‌లో గెలుపోటములపై జరుగుతున్న సర్వేల్లో స్పష్టత లేదు. ఈ సర్వేలన్నీ నమ్మదగినవి కావు. ప్రజలే తుదితీర్పు ఇస్తారు. ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం ఖాయం” అని పేర్కొన్నారు. 

జూబ్లీహిల్స్ ఉప​ఎన్నికను తాము ప్రతిష్టాత్మకంగా భావించడం లేదని, ఈ ఎన్నిక కేంద్రంలోని బీజేపీ పాలనకు రెఫరెండం కానే కాదని అన్నారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్​ఎన్నికల్లో బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయని, కానీ ఇప్పుడు ఉప ఎన్నికలో ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఓటర్లకు ఇప్పటికీ స్పష్టత లేదని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ ప్రెస్‌‌‌‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్​’ కార్యక్రమంలో కిషన్​రెడ్డి మాట్లాడారు. 

వ్యక్తిగత విమర్శలు చేయడంపైనే కాంగ్రెస్ దృష్టిపెడుతున్నదని కిషన్​రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీల గురించి గానీ, 400కు పైగా ఇచ్చిన హామీల గురించి గానీ ప్రస్తావించడం లేదని ఫైర్ అయ్యారు. ‘జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో డిపాజిట్​తెచ్చుకోండి చాలు’ అంటూ సీఎం రేవంత్​రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో రేవంత్​రెడ్డి ఒక్కడే వచ్చి ఓటు వేయడు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు” అని అన్నారు. ఈ నియోజకవర్గంలో ఓటింగ్​పర్సంటేజీని సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ మధ్య పొత్తుండదు.. 

రేవంత్​రెడ్డి సీఎంగా ఉండడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదని కేటీఆర్​చేసిన వ్యాఖ్యలను బట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్​మధ్య రహస్య ఒప్పందం ఉందన్నది స్పష్టమవుతున్నదని కిషన్​రెడ్డి అన్నారు. ‘‘2019 ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్​కలిసి పని చేశాయి. ఎప్పటికైనా బీఆర్ఎస్​తమకు పనికొస్తుందనే రాహుల్​భావిస్తున్నారు. అందుకే కాళేశ్వరంపై ​దర్యాప్తు చేయనివ్వలేదు. జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు మేలు చేసేందుకే కేసీఆర్​ఒక్క గంట కూడా అక్కడికి ప్రచారానికి రాలేదు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సహకరించుకుంటున్నాయి” అని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని స్పష్టం చేశారు. 

మజ్లిస్ కోసమే అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌కు మంత్రి పదవి.. 

జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్​రెడ్డి లాగా తాను దిగజారి మాట్లడడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్​లేకపోతే ముస్లింలు లేరని సీఎం రేవంత్​రెడ్డి అనడం ఎంత వరకు కరెక్టు? అంటే వాళ్లకు హిందువులు లేకపోయినా ఫర్వాలేదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్..​మూడూ కుటుంబ పార్టీలే. పదేండ్లుగా బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్..​ మజ్లిస్‌‌‌‌‌‌‌‌ను పెంచి పోషిస్తున్నాయి. ఆ​పార్టీ మెప్పు కోసమే అజారుద్దీన్‌‌‌‌‌‌‌‌కు మంత్రి పదవి ఇచ్చారు. ఆయనను జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లో ఎందుకు పోటీకి దింపలేదు?” అని ప్రశ్నించారు. ‘‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను మేం వ్యతిరేకించడం లేదు. కానీ అందులో 10 శాతం ముస్లింలకు ఇవ్వడన్నే వ్యతిరేకిస్తున్నం. 

56 శాతం మంది బీసీలు ఉంటే, వాళ్లకు కాంగ్రెస్​ఇస్తామంటున్నది 32 శాతమే. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్ధికి ఇస్తున్న నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయో? అందరికీ తెలుసునని.. అక్కడి ప్రజలు వాటర్, విద్యుత్, ఆస్తి పన్నులు ఏవీ కట్టరని.. ఒకవేళ కట్టాలనుకున్నా మజ్లిస్​ నేతలు కట్టనివ్వరని వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు మస్తు నిధులు తెచ్చిన.. 

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ అభివృద్ధికి ముఖ్యంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు​భారీగా నిధులు తెచ్చానని కిషన్​రెడ్డి తెలిపారు. ‘‘తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర ఉంది. రాష్ట్ర ప్రాజెక్టుల కోసమే ఢిల్లీలోని నా కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాను. రక్షణ సంస్థలకు రూ.1.40 లక్షల కోట్లు తెచ్చాను. ఎన్నో రీసెర్చ్​సంస్థలను నగరానికి తీసుకొచ్చాను. 

మహిళా స్కిల్​సెంటర్, హైటెక్​సిటీలో రవీంద్ర భారతి తరహాలో కల్చరల్​సెంటర్​, రూ.1,400 కోట్లతో ఔటర్​రింగ్​రైల్ ప్రాజెక్టు, రూ.420 కోట్లతో ఎంఎంటిఎస్​ రెండోదశ యాదాద్రి వరకు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. మెట్రోరైలుకు రూ.1,450 కోట్లు మంజూరు చేశాం. ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌కు రూ.1,360 కోట్లు, కంటోన్మెంట్​ అభివృద్ధికి రూ.300 కోట్లు, హైవేల నిర్మాణానికి రూ.1.20 కోట్లు కేటాయించాం. సిటీలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నాం. 

నగరం నుంచి 5 వందే భారత్​రైళ్లను నడుపుతున్నాం. రూ.1,030 కోట్లతో అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట ఫ్లైఓవర్, ఉప్పల్​ఫ్లైఓవర్ నిర్మిస్తున్నాం” అని వివరించారు. కాంగ్రెస్ మాత్రం సకల సమస్యలకు ఫ్రీ బస్​ఒక్క దాన్ని పరిష్కారంగా చూపుతున్నదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్​అధ్యక్షుడు విజయ్​కుమార్​రెడ్డి, ఉపాధ్యక్షురాలు అరుణ, ప్రధాన కార్యదర్శి రమేశ్, జాయింట్​ సెక్రటరీలు హరిప్రసాద్, బాపూరావు పాల్గొన్నారు.