డబ్బు దొరికితే ఎందుకు బయటపెట్టలే: కిషన్ రెడ్డి 

డబ్బు దొరికితే ఎందుకు బయటపెట్టలే: కిషన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదని తెలిసే ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం కేసీఆర్ కొత్త డ్రామాకు తెరలేపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలంటే విచారణకు ఆదేశించాలన్నారు. గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఫామ్ హౌస్​లో డబ్బు దొరికిందని చెబుతున్నరు. అసలు ఎంత దొరికింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అనేది ఎందుకు బయటపెట్టడం లేదు. ఫామ్ హౌస్​లో ఉన్న ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ కు తీసుకెళ్లారు. మరి వాళ్లను స్టేషన్​కు తీసుకెళ్లి ఎందుకు విచారించలేదు” అని ప్రశ్నించారు. ఇది కుట్రేనని అర్థమవుతోందన్నారు. ‘‘ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా? ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో చేర్చుకొని మంత్రి పదవులు ఇయ్యలేదా? ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు? రాష్ట్రంలో చాలా పార్టీలను మింగిన చరిత్ర కేసీఆర్ ది. వైసీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో చేర్చుకొని ఆ పార్టీలు లేకుండా చేశారు. మండలిలో కాంగ్రెస్  లేకుండా చేశారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్​లో చేర్చుకొని ఆ పార్టీ ఎల్పీ లేకుండా చేసింది కేసీఆర్ కాదా?” అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇటీవల తమ పార్టీ నాయకుడితో మాట్లాడి టీఆర్ఎస్​లోకి రావాలని కోరారని చెప్పారు. పార్టీ ఫిరాయింపు కేసులు పెట్టాలంటే ముందుగా కేసీఆర్, కేటీఆర్ పైనే పెట్టాలన్నారు. ‘‘గతంలో కేసీఆర్ కొన్ని సినిమాలు తీశారు. అవి వర్కవుట్ అయ్యాయి. కానీ ఈ ఫామ్ హౌస్ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ రీలు డబ్బాలు వెనక్కి వస్తున్నాయి” అని ఎద్దేవా చేశారు. కేసీఆర్​కు దమ్ముంటే సంజయ్ సవాల్ ను స్వీకరించాలని, యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.  

మాకు 2023 వరకు ఆగే ఓపిక ఉంది.. 

బీజేపీకి ప్రజల నుంచి వచ్చే నాయకత్వం కావాలని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వంద కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. తమ వద్ద రూ.400 కోట్లు, ప్రత్యేక విమానం లేవని చెప్పారు. ‘‘ఆ నలుగురితో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమా? ఉన్న ప్రభుత్వాన్ని కూల్చగలమా? మాకేం పని.. మేమెందుకు ఇలాంటివి చేస్తాం. 2023 వరకు ఆగే ఓపిక మాకుంది. మేం ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాలనుకుంటే, దానికి మా పార్టీలో ప్రత్యేక కమిటీ ఉంది. అంతేగానీ ఎవరో స్వాములు, మధ్యవర్తుల ద్వారానో చేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేం ఎవరినన్నా చేర్చుకోవాలనుకుంటే, వాళ్లతో పదవులకు రాజీనామా చేయించే చేర్చుకుంటాం. ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇలానే చేశాం” అని చెప్పారు.  

నందకుమార్ కు టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు.. 

మధ్యవర్తిగా పేర్కొంటున్న నందకుమార్​తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నందకుమార్​కు కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నేతలతోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి హరీశ్​ రావుతో నందకుమార్ దిగిన ఫొటోలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ఆ ఫొటోలను మీడియాకు చూపించారు. ‘‘నందకుమార్ తో నాకు సంబంధం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఆయన పిలిచిన ప్రారంభోత్సవానికి వెళ్తే సంబంధం ఉన్నట్టేనా? నేను వెళ్లిన హోటల్ ప్రారంభానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా వచ్చారు” అని చెప్పారు.