బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా.. ఓడినా.. నో యూజ్: కిషన్​రెడ్డి

బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా..  ఓడినా.. నో యూజ్: కిషన్​రెడ్డి
  • బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా..  ఓడినా.. నో యూజ్
  • రాష్ట్రంలో మెజారిటీ సీట్లు మేమే గెలుస్తం: కిషన్​రెడ్డి
  • కాంగ్రెస్​వి గారడీ మాటలే.. గ్యారంటీలు అమలు కావు
  • కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా.. ఓడినా.. నో యూజ్ అని, ఆ పార్టీ గురించి చర్చ అనవసరం అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బీజే పీ స్టేట్​ఆఫీస్​లో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్​జనార్దన్ రాథోడ్, అతని అనుచరులు, వరంగల్ జిల్లా నర్సంపేటకు  చెందిన రాణాప్రతాప్​తో పాటు  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. 9 ఏండ్ల నుంచి ప్రధాని మోదీ నీతివంతమైన పాలన అందిస్తున్నారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. యూపీఏ పాలన అంతా అవినీతి మయం అని, కేంద్ర మంత్రులు కుంభకోణాల్లో జైలుకు వెళ్లారన్నారు.  

రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు కష్టం

కేంద్రంలో కాంగ్రెస్ గెలిచేది లేదు.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదని కిషన్​ రెడ్డి అన్నారు. తెలంగాణలో 6 గ్యారంటీలు అమలయ్యే వీలులేదని, అవి గ్యారంటీలు కాదని, గారడీ మాటలే అని ఆయన ఎద్దేవా చేశారు.  ఎంపీ ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ విదేశాలకు వెళతారన్నారు. గత సీఎం  కేసీఆర్ అవినీతికి పాల్పడి.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితికి తీసుకొచ్చారని ఆయన ఫైర్ అయ్యారు.

అనంతరం బోరబండ మార్కెట్లో కిలో టమాటలు కొని కిషన్ రెడ్డి డిజిటల్ పేమెంట్ చేశారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించిన తర్వాత.. అటుగా వెళ్తూ మార్కెట్లోకి వెళ్లి కూరగాయలు అమ్మె వారితో మాట్లాడారు. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీకి భారతరత్న ప్రకటించటంపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పారదర్శకత, సమగ్రతతో పాటుగా విలువలను పాటిస్తూ దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన ప్రజాజీవితం మార్గదర్శనీయమని ఓ ప్రకటనలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.