ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్ ఓట్లు మాకే పడినయ్‌‌: కిషన్ రెడ్డి

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్​ఎస్ ఓట్లు మాకే పడినయ్‌‌: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్‌‌ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలవబోతున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్‌‌ కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌‌‌‌ఎస్ కార్యకర్తలు, సానుభూతిపరులు బీజేపీకే ఓటు వేశారని చెప్పారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌‌లో నిర్వహించిన యువ మోర్చా మీటింగ్‌‌లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై అసత్య ఆరోపణలు చేశారని, వీటిని ఆయన పార్టీ వాళ్లే నమ్మడం లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో బీఆర్‌‌‌‌ఎస్ సర్కారు ఆడుకుందని ఫైర్ అయ్యారు. 

అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయిందని మండిపడ్డారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, చేయడం లేదన్నారు. ఫ్రీ జర్నీ స్కీమ్ తప్ప మిగిలిన గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి అని చెప్పి ఇప్పుడేమో అలాంటి హామీ ఇవ్వలేదని ఆ పార్టీ నేతలు అంటున్నారని గుర్తుచేశారు. 

రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని, బీఆర్‌‌‌‌ఎస్ పని ఖతం అయిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమలుపై బీజేవైఎం నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నేతలు రెడీగా ఉండాలన్నారు.