సింగరేణిలో ‘కోల్ గ్యాసిఫికేషన్’ ప్రారంభించండి..సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి

సింగరేణిలో ‘కోల్ గ్యాసిఫికేషన్’ ప్రారంభించండి..సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్  లో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. దీనివల్ల ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. గురువారం కోల్ గ్యాసిఫికేషన్ పై ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భారతదేశ ఎనర్జీ సెక్యూరిటీ, పారిశ్రామిక అభివృద్ధి, ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నదన్నారు.

ఇందులో కోల్ గ్యాసిఫికేషన్‌‌‌‌ కీలకమైందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకంలో కొన్నేండ్లుగా ఈ ప్రాజెక్టును సక్సెస్ చేసేందుకు పటిష్టమైన వ్యవస్థ నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. 2014లో రూ.8,500 కోట్లతో మొదటి దశ కోల్ గ్యాసిఫికేషన్ స్కీమ్​ ప్రారంభించినట్లు తెలిపారు.

చాలా తక్కువ సమయంలోనే 8 ప్రాజెక్టులు ముందుకొచ్చాయన్నారు. ఇటీవల కేంద్ర కేబినెట్ రెండో దశ పథకానికి రూ.37,500 కోట్ల ప్రోత్సాహక ప్యాకేజీకి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. దీని ద్వారా సుమారు రూ.2.5 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నట్లు వెల్లడించారు. 

కోట్లాది మందికి జీవనోపాధి

బొగ్గు ఉత్పత్తిలో, వినియోగంలో భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉందని కేంద్ర మంత్రి అన్నారు.  దాదాపు 70% విద్యుత్ ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతోందని తెలిపారు. అందుకే కోల్ గ్యాసిఫికేషన్ అనేది విద్యుత్ రంగానికి సంబంధించింది మాత్రమే కాదని, కోట్లాది మందికి జీవనోపాధి అందిస్తున్న రంగమని పేర్కొన్నారు. అందుకే ఈ రంగంలో ఇంధన భద్రతతో పాటు సుస్థిరాభివృద్ధితో 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధించి, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.