సెప్టెంబర్ 17 వేడుకలకు 3 రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాం

సెప్టెంబర్ 17 వేడుకలకు 3 రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాం

పరేడ్ గ్రౌండ్ : హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకల్ని ఏడాది పాటు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు ఉదయం 8.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్థూపానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. ఆ తర్వాత సర్థార్ పటేల్కు ఆయన నివాళులర్పించనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం నిర్వహిస్తున్న సెప్టెంబర్ 17 వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక సీఎంలను ఆహ్వానించామని కిషన్ రెడ్డి అన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యక్రమానికి హాజరుకావడంపై ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకల్లో భాగంగా రెండు మహిళా బృందాలతో కలిపి మొత్తం12 పారా మిలటరీ బలగాలు పరేడ్ నిర్వహిస్తాయని కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన 1200 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. విమోచన దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 7.30గంలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పటేల్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. సాయంత్రం 5గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరోవైపు ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సందర్భంగా దివ్యాంగులకు అమిత్ షా ఉపకరణాలు అందజేయనున్నారు. విమోచన దినోత్సవాన్ని ప్రజల కార్యక్రమంగా భావించి అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.