
తిరుపతి: కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని కోరుకున్నట్టు చెప్పారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఎర్ర చందనం స్మగ్లింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి తల్లి వకుళామాత ఆలయం నిర్మాణానికి టీటీడీ పూనుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి సాయం చేస్తానని తెలిపారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం మరింత సమర్ధవంతంగా పని చేస్తోందన్న ఆయన.. దేశం ఎదుర్కొంటున్న జాతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారాలు ప్రధాని మోడీకి ఆశీస్సులు అందించాలని వెంకటేశ్వర స్వామిని వేడుకున్నామని చెప్పారు కిషన్ రెడ్డి.