కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి బెర్త్ ఖాయమేనా?

కేంద్ర మంత్రివర్గంలో కిషన్ రెడ్డి బెర్త్ ఖాయమేనా?
  • రాష్ట్ర కోటా రేసులో కిషన్ రెడ్డి?
  • తొలి విడతలో రాష్ట్రానికి మంత్రి పదవి దక్కేనా?
  • లష్కర్​కు ప్రాధాన్యమిస్తారని బీజేపీ నేతల ఆశలు.

బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డికి తెలంగాణ కోటా రేసులో కేంద్ర మంత్రి పదవి ఖాయమేనంటున్నాయి పార్టీ వర్గాలు. లష్కర్​ నుంచి భారీ మెజార్టీతో గెలిచినందున కీలక శాఖ దక్కుతుందని చర్చ సాగుతోంది. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా, పార్టీకి విధేయుడిగా పేరున్నందున మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో నేతలున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని యత్నిస్తున్న పార్టీ కిషన్​రెడ్డికి ప్రాధాన్యమిస్తుందని భావిస్తున్నారు.

లష్కర్​కు మంత్రి యోగం దక్కేనా?

  • కేంద్రంలో కిషన్ రెడ్డికి మంత్రి పదవిపై సర్వత్రా చర్చ
  • తెలంగాణ కోటాలో పక్కా అంటున్న నేతలు

లష్కర్​ నుంచి గెలుపొందిన జి.కిషన్​రెడ్డికి కేంద్రంలో మంత్రి యోగంపై బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ చర్చ జరుగుతున్నది. ఆయనకు ఉన్న బ్యాగ్రౌండ్​, జంటనగరాలకు ప్రాతినిధ్యం, తెలంగాణ కోటా వంటి కోణంలో మంత్రి హోదా పక్కా అని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాకుండా ప్రాధాన్యత కలిగిన మంత్రిత్వశాఖ బాధ్యతలను కూడా అప్పగిస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. బుధవారం న్యూఢిల్లీలో రెండోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ  పదవీప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొత్త క్యాబినేట్​ కూర్పులో కిషన్​రెడ్డి కూడా ఉంటారని అందరూ భావిస్తున్నారు.

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి అధికార టీఆర్​ఎస్​ పార్టీకి ప్రత్యాన్మయంగా ఎదిగేందుకు వీలుగా కిషన్​రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రం నుంచి గెలుపొందిన నలుగురు ఎంపీల్లో కిషన్​రెడ్డికి పార్టీ అధిష్టానం అండదండలు ఉండడం, ధీర్ఘకాలం పాటు ఆర్​ఎస్​ఎస్ పనిచేయడం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం,  ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు కావడం కలిసివచ్చే అంశాలుగా చెబుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 4 మంత్రి పదవులు 

తెలంగాణలో నలుగురు  ఎంపీలు గెలిచారు.  ఈ నలుగురు కూడా ప్రాధాన్యత కలిగిన స్థానాల నుంచి ప్రతిష్టాత్మకంగా గెలుపొందినవారు కావడం విశేషం. దాంతో ఈ నలుగురికి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది.  గతంలో ప్రధానమంత్రిగా వాజ్ పేయ్ హయాంలో  ఉమ్మడి రాష్ట్రం నుంచి నలుగురు ఎంపీలు గెలిస్తే  ఆ నలుగురికి  మంత్రి పదవులు దక్కిన విషయాన్ని ఈ సందర్భంగా పార్టీ సీనియర్​ నాయకుడొకరు గుర్తుచేశారు.

మళ్లీ నరేంద్ర మోదీ కూడా  అదే సీన్ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదంటున్నారు.  నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ కూతురు కవితపై డి.అర్వింద్ గెలిచారు. కరీంనగర్​లో టీఆర్​ఎస్​ సీనియర్​నేత వినోద్​పై బండి సంజయ్, ఆదిలాబాద్​లో లంబాడేతర గిరిజన నేత  సోయం బాబూరావులు బీజేపీ ఎంపీలుగా విజయంసాధించడాన్ని  పార్టీ జాతీయ నాయకులు గర్వంగా ఫీల్​ అవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మరికొన్ని గంటల్లో దీనిపై కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాధాన్యతకు అంశం స్పష్టం కానున్నది.