సెంట్రల్ హైదరాబాద్‭ను ప్రభుత్వం పట్టించుకుంటలేదు : కిషన్ రెడ్డి

సెంట్రల్ హైదరాబాద్‭ను ప్రభుత్వం పట్టించుకుంటలేదు : కిషన్ రెడ్డి

ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు పోరాటం చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్‭ను గద్దె దించేందుకు బీజేపీ పనిచేయాలని కిషన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ మరో మజ్లిస్ పార్టీ అని ఆయన ఆరోపించారు. సెంట్రల్ హైదరాబాద్‭ను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీలో ఉండే కార్పొరేటర్లకు హక్కులు ఇవ్వడం లేదని అన్నారు. కార్పొరేటర్ల పట్ల ప్రభుత్వం పక్షపాతంగా వ్యవరిస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. కార్పొరేటర్లకు హక్కులు ఇవ్వకపోతే జీహెచ్ఎంసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ ది దుర్మార్గమైన పాలన అని కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‭లో ఏ ప్రాంతానికి వెళ్లినా.. పేద ప్రజలు డబుల్ బెడ్ రూం ఇళ్లు అడుగుతున్నారని చెప్పారు. ప్రభుత్వం పేదలను దగా చేస్తోందని ఆయన ఆరోపించారు. పెన్షన్, రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలకు సరైన న్యాయం జరిగే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.