జనవరి13 నుంచి పతంగుల ఫెస్టివల్

జనవరి13 నుంచి పతంగుల ఫెస్టివల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్‌‌ నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జ‌‌న‌‌వ‌‌రి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌లో నిర్వహించనున్న కైట్ అండ్‌‌ స్వీట్ ఫెస్టివ‌‌ల్‌‌ను ప‌‌ర్యాట‌‌క శాఖ‌‌ ఏర్పాట్లు చేస్తోందని తెలి పారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 16 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, 60 దేశవాళి కైట్ క్లబ్ సభ్యులు పాల్గొని పలు డిజైన్లలో రూపొందించిన పతంగులను ఎగుర వేస్తారని తెలిపారు. 

వీటితో పాటు జాతీయ‌‌, అంతర్జాతీయ స్వీట్స్‌‌ స్టాల్స్‌‌లో అందుబాటులో ఉంచుతార‌‌ని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం బేగంపేటలోని హరిత ప్లాజాలో మంత్రి జూపల్లి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పోస్టర్‌‌‌‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. కైట్ ఫెస్టివల్‌‌లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వ హించడంతో పాటు చేనేత వ‌‌స్త్రాల స్టాల్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉచిత ప్రవేశం ఉంటుందని వెల్లడించారు.  

ప్రపంచస్థాయి సౌలతులు అవసరం..

రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పర్యాటకులను రప్పించాలంటే ఆ స్థాయిలో సౌలతులు కల్పించాలని మంత్రి జూపల్లి అన్నారు. పర్యాటకుల రద్దీకి తగినట్లు వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. టూరిజంపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక శాఖ మొదలు పెట్టిన ప్రాజెక్ట్‌‌లను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.