KKR Opening Pair: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీని జస్ట్ రూ. 3.50 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

KKR Opening Pair: వరల్డ్ కప్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీని జస్ట్ రూ. 3.50 కోట్లకు కొనుగోలు చేసిన కేకేఆర్

KKR Opening Pair: టీ20 ప్రపంచకప్ ముగిసింది.. అందరి చూపు ఇప్పుడు మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 పైనే పడింది.  ఈసారి 10 జట్లు బరిలో దిగుతుండగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు తీరు మాత్రం అత్యంత ఆసక్తికరంగా మారింది. మూడుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన కేకేఆర్ కు 2025 సీజన్ ఒక పీడకలలా గడిచింది. ఆ సీజన్‌లో ఒక్కసారి కూడా 50 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయింది. గతంలో 2008లో ఆర్‌సీబీ, 2010లో ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ఇలాంటి దారుణమైన రికార్డును మూటగట్టుకున్నాయి. అయితే, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది. శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా, అజింక్య రహానే సారథ్యంలో కేకేఆర్ సరికొత్తగా ముస్తాబవుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా, కేవలం రూ. 3.50 కోట్లకే కేకేఆర్‌ను టైటిల్ ఫేవరెట్‌గా నిలబెట్టే జోడీ లభించింది.  

ఆ ఇద్దరు మ్యాజిక్: 
డిసెంబర్ 2025లో అబుదాబీలో జరిగిన మినీ వేలంలో, కేకేఆర్ ఎవరూ ఊహించని విధంగా ఫిన్ అలెన్‌ను రూ. 2 కోట్లకు, టిమ్ సీఫెర్ట్‌ను రూ.1.50 కోట్లకు దక్కించుకుంది. ఎలాంటి పోటీ లేకుండా బేస్ ప్రైస్‌కే వీరిద్దరూ దక్కడం విశేషం. కానీ కొద్ది నెలల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ సృష్టించిన విధ్వంసం చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఇద్దరు కలిసి కేవలం 8 ఇన్నింగ్స్‌ల్లో 494 పరుగులు చేశారు. 70.57 సగటుతో.. 188.40 స్ట్రైక్ రేట్ నెలకొల్పారు. కాగా యూఏఈపై 175* పరుగుల భాగస్వామ్యంతో పాటు సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై వీరి పార్ట్‌నర్‌షిప్‌ లో 117 పరుగులు చేశారు.  ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన సెమీఫైనల్లో ఫిన్ అలెన్ కేవలం 33 బంతుల్లోనే సెంచరీ కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేకేఆర్ వేలంలో కెమెరాన్ గ్రీన్ కోసం రూ. 25.20 కోట్లు, మతీష పతిరణ కోసం రూ. 18 కోట్లు ఖర్చు చేసింది. కానీ, గ్రీన్, పతిరణలతో పోల్చితే.. అలెన్-– సీఫెర్ట్ జోడీకి 15 శాతం కంటే తక్కువకే దక్కడం విశేషం. వీరిద్దరి ప్రస్తుత మార్కెట్ విలువ తలో రూ.12 నుండి రూ15 కోట్లు ఉంటుందని విశ్లేషకుల అంచనా.

కేకేఆర్ రాత మారనుందా?: 
గత సీజన్‌లో కేకేఆర్ పవర్‌ప్లేలో పరుగుల కోసం చాలా ఇబ్బంది పడింది. సునీల్ నరైన్ మీద అతిగా ఆధారపడటం వలన అతను విఫలమైనప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పై ఒత్తిడికి లోనయ్యేది. కానీ అలెన్, సీఫెర్ట్ రాకతో ఆ సమస్య ఇప్పుడు తీరిపోయింది. కాగా, ఇప్పుడు నరైన్ స్వేచ్ఛగా 7 లేదా 8వ స్థానంలో ఫినిషర్‌గా రావచ్చు. పవర్‌ప్లే భారం అతనిపై ఉండదు. అలాగే, అలెన్, సీఫెర్ట్ ఇద్దరూ కీపింగ్ చేయగలరు. దీనివల్ల ప్రత్యేకంగా కీపర్ అవసరం లేకుండా, 'ఇంపాక్ట్ ప్లేయర్' రూపంలో అదనపు బౌలర్‌ను ఆడించే అవకాశం కేకేఆర్‌కు ఉంటుంది. దీంతో అలెన్, సీఫెర్ట్, రహానే, గ్రీన్, రింకూ సింగ్.. ఈ టాప్–-5 ఏ జట్టుకైనా వణుకు పుట్టించేలా ఉంది.

నలుగురు విదేశీ ఆటగాళ్ల రూల్: 
కేకేఆర్ ముందున్న ప్రధాన సమస్య విదేశీ ఆటగాళ్ల ఎంపిక ఒక్కటే.. అలెన్, సీఫెర్ట్, గ్రీన్, నరైన్ తుది జట్టులో ఉంటే.. రోవ్‌మన్ పవల్ లేదా మతీష పతిరణ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అభిషేక్ నాయర్ అండ్ మేనేజ్‌మెంట్ ఈ పజిల్‌ను ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా, ఫిన్ అలెన్‌కు ఈడెన్ గార్డెన్స్ అచ్చొచ్చిన మైదానం.. ప్రపంచకప్‌లో అక్కడ సెంచరీ బాదిన ఊపుతో, మార్చి 28వ తేదీన కోల్‌కతా అభిమానుల మధ్య అతను బరిలోకి దిగబోతున్నాడు.