కోల్‌కతాపై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

కోల్‌కతాపై ముంబై థ్రిల్లింగ్ విక్టరీ

ముంబై ఇండియన్స్‌‌ మాయ చేసింది..! 153 రన్స్‌‌ టార్గెట్‌‌ను కాపాడుకొని ఐపీఎల్‌‌–14వ సీజన్‌‌లో బోణీ కొట్టింది..! చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో నితీష్ రాణా (47 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57) ఫిఫ్టీతో చెలరేగడంతో 15 ఓవర్లకు 122/4 స్కోరు చేసి ఈజీగా గెలిచేలా కనిపించిన కోల్‌‌కతా నైట్ రైడర్స్‌‌కు ముంబై బౌలర్లు షాకిచ్చారు..! చివరి ఐదు ఓవర్లలో కట్టుదిట్టమైన బంతులతో 20 పరుగులే ఇచ్చి ఓటమి ఖాయం అనుకున్న తమ జట్టును గెలిపించారు..!  ఆండ్రీ రసెల్‌‌ (5/15) రెండు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీసి ముంబైని కట్టడి చేసినా.. నితీష్ మంచి ఆరంభం ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన కేకేఆర్‌‌‌‌ చేజేతులా ఓడింది..!

చెన్నై: ఓటమి ఖాయం అనుకున్న మ్యాచ్‌‌లో... ఆశలు లేని స్థితిలో అద్భుతంగా పోరాడిన ముంబై ఐపీఎల్‌‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.  మంగళవారం ఇక్కడ చెపాక్‌‌ స్టేడియంలో లాస్ట్‌‌ బాల్‌‌ వరకూ ఉత్కంఠగా సాగిన లో స్కోరింగ్‌‌ మ్యాచ్‌‌లో ముంబై 10 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతాను ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 152 రన్స్‌‌కు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (36 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) ఫిఫ్టీతో మెరవగా.. కెప్టెన్‌‌ రోహిత్ శర్మ (32 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్సర్లతో 43) రాణించాడు. అనంతరం ఓవర్లన్నీ ఆడిన కేకేఆర్‌‌‌‌ 142/7 స్కోరుకే పరిమితమై ఓడిపోయింది. రాణాతో పాటు గిల్‌‌ (33) రాణించినా మిగతా ప్లేయర్లు ఘోరంగా నిరాశ పరిచారు. ముంబై బౌలర్లలో రాహుల్ చహర్ (4/27) నాలుగు వికెట్లు తీయగా.. క్రునాల్ పాండ్యా (1/13), బౌల్ట్ (2/27) అద్భుతంగా బౌలింగ్‌‌ చేశారు. చహర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.  

సూర్య–రోహిత్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌

భారీ హిట్టర్లు ఉన్న ముంబైని నార్మల్‌‌ స్కోరుకే కట్టడి చేయడంలో కోల్‌‌కతా సక్సెస్‌‌ అయింది. టాస్‌‌ నెగ్గి బౌలింగ్‌‌ ఎంచుకున్న కోల్‌‌కతా కెప్టెన్‌‌ ఇయాన్ మోర్గాన్‌‌.. వరుసగా ఐదు ఓవర్లు స్పిన్నర్లతో వేయించి ఆశ్చర్యపరిచాడు. ఈ ప్లాన్‌‌కు మంచి రిజల్టే వచ్చింది. సెకండ్‌‌ ఓవర్లోనే ఓపెనర్ క్వింటన్ డికాన్‌‌ (2)ను ఔట్‌‌ చేసిన వరుణ్‌‌ ముంబైని తొలి దెబ్బకొట్టాడు. అయితే వన్‌‌డౌన్‌‌లో వచ్చిన సూర్యకుమార్ ఫామ్ కొనసాగించాడు. భజ్జీ వేసిన తర్వాతి ఓవర్లోనే మూడు బౌండ్రీలతో జోరు చూపెట్టాడు. పవర్‌‌ప్లేలో ముంబై 42/1తో నిలిచింది. ఫీల్డ్‌‌ రిస్ట్రిక్షన్స్‌‌ మారిన తర్వాత ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టిన సూర్య.. కమిన్స్‌‌ బౌలింగ్‌‌లో మరో సిక్స్‌‌తో 33 బాల్స్‌‌లోనే  ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

బౌలర్ల పంజా

సూర్య, రోహిత్‌‌ జోరు మీద ఉన్నా 11వ ఓవర్ నుంచి కేకేఆర్‌‌‌‌ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. షకీబ్‌‌ బౌలింగ్‌‌లో లాఫ్ట్‌‌ షాట్‌‌ ఆడిన సూర్య.. లాంగాన్‌‌లో గిల్‌‌కు క్యాచ్‌‌ ఇవ్వడంతో సెకండ్‌‌ వికెట్‌‌కు 76 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. ఆ వెంటనే కమిన్స్‌‌ ఓ షార్ట్‌‌ బాల్‌‌తో ఇషాన్‌‌ కిషన్‌‌ (1)ను వెనక్కుపంపడంతో ముంబై 88/3తో డీలా పడింది. ప్రసిధ్ వేసిన 14వ ఓవర్లో హార్దిక్ (15) బౌండ్రీ, రోహిత్ సిక్స్‌‌ బాది ఇన్నింగ్స్‌‌కు  మళ్లీ ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ, స్లాగ్‌‌ ఓవర్లలో కేకేఆర్ బౌలర్లు మరింత రెచ్చిపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేసిన కమిన్స్.. తన లాస్ట్‌‌ ఓవర్లో అద్భుతమైన ఆఫ్ కట్టర్‌‌‌‌తో హిట్‌‌మ్యాన్‌‌ను క్లీన్‌‌బౌల్డ్ చేశాడు. ఆపై ప్రసిధ్ బౌలింగ్‌‌లో హార్దిక్, రసెల్‌‌ వేసిన 18వ ఓవర్లో  పొలార్డ్‌‌ (5), జెన్సెన్ (0)  వికెట్లు పారేసుకోవడంతో ముంబై మరింత డీలా పడింది. చివర్లో క్రునాల్ పాండ్యా (15)  పోరాటంతో స్కోరు 150 దాటింది. లాస్ట్‌‌ ఓవర్లో 3 వికెట్లు తీసిన రసెల్‌‌ ఐదు వికెట్ల స్పెల్‌‌తో అదరగొట్టాడు.  

రాణా, గిల్‌‌ మెరిసినా.. 

నితీష్​తో పాటు గిల్‌‌ కూడా టచ్‌‌లోకి రావడంతో చిన్న టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో  కోల్‌‌కతాకు మంచి ఆరంభం దక్కింది.  ఫస్ట్‌‌ బాల్‌‌నే బౌండ్రీకి చేర్చిన రాణా... బౌల్ట్‌‌ బౌలింగ్‌‌లోనే 6,4తో మరింత స్పీడ్ పెంచాడు. జాన్సెన్‌‌ వేసిన ఆరో ఓవర్లో క్లాసిక్ షాట్లతో మూడు ఫోర్లు బాదిన గిల్‌‌ కూడా గేరు మార్చాడు. పొలార్డ్‌‌ వేసిన 8వ ఓవర్లో  నితీష్ 6,4 కొట్టగా.. రాహుల్ చహర్ బౌలింగ్‌‌లో గిల్ కూడా 4,6తో అలరించాడు. కానీ అదే ఊపులో మరో షాట్ ఆడి పొలార్డ్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌‌కు 72 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌  బ్రేక్ అయింది.  తన తర్వాతి ఓవర్లోనే రాహుల్ త్రిపాఠి (5)ని ఔట్‌‌ చేసిన చహర్‌‌.. కోల్‌‌కతాకు డబుల్ షాకిచ్చాడు. కాసేపటికే మోర్గాన్‌‌ (7)ను వెనక్కుపంపిన చహర్‌‌‌‌... ఫిఫ్టీ పూర్తి  చేసుకున్న నితీష్‌‌ను తన స్పెల్‌‌ లాస్ట్‌‌ బాల్‌‌కు స్టంపౌట్‌‌ చేయించి మ్యాచ్‌‌ను మలుపు తిప్పాడు. ఇక16వ ఓవర్లో షకీబ్‌‌ (9)ను పెవిలియన్‌‌ చేర్చిన  క్రునాల్‌‌  ఒకే  పరుగిచ్చి ముంబైని రేసులోకి తెచ్చాడు.  తర్వాతి ఓవర్లో  బుమ్రా 8 రన్స్‌‌ ఇచ్చినా.. 18వ ఓవర్లో క్రునాల్‌‌ మూడు పరుగులే ఇవ్వడంతో కేకేఆర్‌‌‌‌పై ఒత్తిడి పెరిగింది.  లాస్ట్‌‌ రెండు ఓవర్లలో19 రన్స్‌‌ అవసరం అవగా.. 19వ ఓవర్లో బుమ్రా  నాలుగే ఇచ్చాడు. లాస్ట్‌‌ ఓవర్లో రసెల్ (9), కమిన్స్‌‌ (0)ను ఔట్‌‌ చేసిన బౌల్ట్‌‌ 4 పరుగులే ఇచ్చి ముంబైని గెలిపించాడు.