T20ల్లో చరిత్ర సృష్టించిన KL రాహుల్.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు

T20ల్లో చరిత్ర సృష్టించిన KL రాహుల్.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు

న్యూఢిల్లీ: టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‎లో తక్కువ ఇన్సింగ్స్‎ల్లో 8 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‎గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. కోహ్లీ 243 ఇన్నింగ్స్‎లలో 8 వేల పరుగుల మైలురాయిని అందుకోగా.. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించి కోహ్లీ ఆల్ టైమ్ రికార్డ్‎ను బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ 18లో భాగంగా ఆదివారం (మే 18) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులో రాహుల్ ఈ రికార్డ్ నెలకొల్పాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఇండియన్ బ్యాటర్‎గా రికార్డ్ సృష్టించిన రాహుల్.. ఓవరాల్‎గా పొట్టి ఫార్మాట్‎లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్ కంటే ముందు టీ20 విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్, పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ అజామ్ ఉన్నారు.

క్రిస్ గేల్ 213 ఇన్నింగ్స్‎లు, బాబర్ అజామ్ 218 ఇన్నింగ్స్‎ల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. వీరి తర్వాత కేఎల్ రాహుల్ (224 ఇన్సింగ్స్‎లు) మూడో స్థానంలో ఉన్నాడు. ఇక, ఐపీఎల్ 18 సీజన్లో రాహుల్ అద్భుతమైన ఫామ్‎లో ఉన్నాడు. భార్య డెలివరీ కారణంగా లీగ్ తొలి మ్యాచుకు దూరమైన రాహుల్.. ఆ తర్వాత జట్టుతో కలిశాడు. ఢిల్లీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే వరకు ఈ సీజన్లో 11 మ్యాచులు ఆడి 488 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. 

టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు వీరే:

1 - క్రిస్ గేల్: 213 ఇన్నింగ్స్‌లు

2 - బాబర్ అజామ్: 218 ఇన్నింగ్స్‌లు

3 - కేఎల్ రాహుల్: 224 ఇన్నింగ్స్‌లు

4 - విరాట్ కోహ్లీ: 243 ఇన్నింగ్స్‌లు

5 - మహ్మద్ రిజ్వాన్: 244 ఇన్నింగ్స్‌లు