IND vs WI 2nd Test: బంతి తగిలి విలవిల్లాడిన రాహుల్.. ఇన్ స్వింగ్ ధాటికి నొప్పితో గ్రౌండ్‌లోనే పడిపోయాడు

IND vs WI 2nd Test: బంతి తగిలి విలవిల్లాడిన రాహుల్.. ఇన్ స్వింగ్ ధాటికి నొప్పితో గ్రౌండ్‌లోనే పడిపోయాడు

ఢిల్లీ వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పెద్ద గాయం నుంచి బయటపడ్డాడు. నాలుగో రోజు ఆటలో భాగంగా వెస్టిండీస్ నిర్దేశించిన 121 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయడానికి టీమిండియా బ్యాటింగ్ కు వచ్చింది. రెండో ఓవర్ లో జైశ్వాల్ ఔట్ కావడంతో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అయితే జేడెన్ సీల్స్ వేసిన మూడో ఓవర్లో కేఎల్ రాహుల్ ను ఊహించని గాయం ఇబ్బంది పెట్టింది. ఈ ఓవర్ మూడో బంతి ఇన్ స్వింగ్ తిరగడంతో రాహుల్ గజ్జల్లో బంతి బలంగా తగిలింది. నొప్పితో విలవిల్లాడిన రాహుల్ గ్రౌండ్ లో పడిపోయాడు. 

ఫిజియో వచ్చి రాహుల్ కు చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ఎలాంటి గాయం కాకపోవడంతో మళ్ళీ బ్యాటింగ్ ప్రారంభించాడు. విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదర్కొన్న రాహుల్ 54 బంతుల్లో 25 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 38 పరుగులు చేసి రాణించిన కేఎల్.. రెండో ఇన్నింగ్స్ లో తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా విజయానికి 121 పరుగులు అవసరం కాగా.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.

ప్రస్తుతం క్రీజ్ లో రాహుల్ (25), సాయి సుదర్శన్ (30) ఉన్నారు. ఇండియా గెలవాలంటే చివరి రోజు 58 పరుగులు చేయాలి. మరోవైపు వెస్టిండీస్ విజయానికి 9 వికెట్లు అవసరం. ఈ టెస్టులో టీమిండియా విజయం దాదాపు ఖాయంగా మారింది. ఐదో రోజు తొలి సెషన్ లో మ్యాచ్ ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఫాలో ఆన్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 390 పరుగులకు ఆలౌటై ఇండియా ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.