KL Rahul: ఒత్తిడిలో జట్టును గెలిపించాను.. నా వన్డే కెరీర్‌లో అదే బెస్ట్ ఇన్నింగ్స్: రాహుల్

KL Rahul: ఒత్తిడిలో జట్టును గెలిపించాను.. నా వన్డే కెరీర్‌లో అదే బెస్ట్ ఇన్నింగ్స్: రాహుల్

బాగా ఆడినప్పుడు ప్రశంసలు, చెత్త ప్రదర్శనకు విమర్శలు రావడం సహజమే. క్రికెట్ ని విపరీతంగా అభిమానించే మన దేశంలో  ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం దీనికి మినహాయింపేమీ కాదు. అతను బాగా ఆడిన ఇన్నింగ్స్ ఎవరూ గుర్తించకపోగా.. విఫలమైతే మాత్రమే విమర్శిస్తారు. ప్రస్తుతం ఇండియాలో రాహుల్ వన్డే, టెస్టుల్లో రెగ్యులర్ ప్లేయర్. టెస్టుల్లో ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాడు. వన్డేల్లో వికెట్ కీపింగ్ చేస్తూ ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడు. రెండు ఫార్మాట్ లలో రాహుల్ భారత జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. ముఖ్యంగా టెస్టుల్లో రాహుల్ అనుభవం టీమిండియాకు బాగా కలిసి వస్తుంది.

వన్డే కెరీర్ లో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ లు ఆడిన రాహుల్.. తన బెస్ట్ ఇన్నింగ్స్ గురించి చెప్పుకొచ్చాడు. 2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాపై జరిగిన లీగ్ మ్యాచ్ లో తీవ్రమైన ఒత్తిడిలో 97 పరుగులు చేసి రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ ను రాహుల్ తన వన్డే బెస్ట్ ఇన్నింగ్స్ గా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో  సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం 199 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియాకు ఘోరమైన ఆరంభం లభించింది.          

అసలే సాధారణ లక్ష్యం.. భారత్ బ్యాటింగ్ లైనప్ కి ఇది స్వల్ప లక్ష్యం. ఆడేది స్వదేశంలో.. ఇంకేముంది వరల్డ్ కప్ లో మనోళ్లు బోణీ కొట్టినట్టే అనుకున్నారు. కానీ భారత్ బ్యాటింగ్ దిగిన పావుగంటలో అల్లకల్లోమైపోయింది. దిగినవారు పెవిలియన్ కి క్యూ కట్టారు.  ఏకంగా ముగ్గురు టాప్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు. 2 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోవడంతో  సొంతగడ్డపై పరాభవం తప్పదేమో అని భయపడ్డారు. ఈ దశలో రాహుల్ 97 పరుగులతో జట్టును గెలిపించాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగించుకున్న రాహుల్ ప్రస్తుతం వెస్టిండీస్ తో స్వదేశంలో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు.