- ఇంజినీరింగ్ అధికారుల సమీక్షలో కేఎంసీ కమిషనర్
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్ లలో చేపడుతున్న పార్కులు, డ్రైనేజ్, రోడ్లు, ఫూట్ ఫత్ ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు స్పీడ్ గా పూర్తి చేయాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కేఎంసీ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పనుల్లో నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాం పై ఏఈఆర్ ఓఎస్, సూపర్ వైజర్లతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి సూపర్ వైజర్ వారికి కేటాయించిన మ్యాపింగ్, ప్రోజనీ శాతాన్ని పెంచేలా సమర్థవంతంగా పని చేయాలన్నారు. రోజూ టెలీకాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిని సమీక్షిస్తూ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
తర్వాత చెరువు బజార్ లో జరుగుతున్న పైప్ లైన్ పనులను ఇంజినీరింగ్, పబ్లిక్ హెల్త్ అధికారులతో కలిసి పరిశీలించారు. అర్బన్ పార్కుకు వెళ్లే రోడ్డు నిర్మాణం పనుల పురోగతిపై ఆరా తీశారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ పై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పనులు పూర్తి చేయాలన్నారు. మరో రెండు రోజులపాటు పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగాణాన్ని మూసి వేయాలని ఆదేశించారు. వ్యాపారుల సౌకర్యార్థం మౌలిక వసతుల పనులు జరుగుతున్నందున రెండు రోజులు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు వ్యాపారులు సహకరించాలని కోరారు.
