న్యూఢిల్లీ: మనదేశంలో అఫోర్డబుల్ హౌజింగ్ సెగ్మెంట్‌కు అద్భుత అవకాశాలు ఉన్నాయని, రూ.45 లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్లను ఆకర్షించే సత్తా దీనికి ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్‌ఫ్రాంక్ ఇండియా సర్వే రిపోర్టు వెల్లడించింది. సిటీల జనానికి కనీసం 3.5 కోట్ల ఇండ్లు అవసరమని లెక్కగట్టింది. ‘బ్రిక్ బై బ్రిక్–లాంగ్ టెర్మ్ క్యాపిటల్ టు ఫండ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఫర్ ఆల్’ పేరుతో నైట్‌ఫ్రాంక్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. ప్రపంచ జనాభాలో 57 శాతం (450 కోట్ల మంది) పట్టణాల్లో నివసిస్తున్నారు. వీరిలో 130 కోట్ల మంది మాత్రమే సబ్‌స్టాండర్డ్ ఇండ్లలో ఉంటున్నారు. మిగతా వాళ్ల కోసం 32.5 కోట్ల ఇండ్లను నిర్మించాలి. ఇండియాలో 35 శాతం మంది పట్టణవాసులు సబ్‌స్టాండర్డ్ ఇండ్లలో ఉంటున్నారు. మనదేశంలో మరో 3.5 కోట్ల కుటుంబాలకు ఇండ్లు కావాలి. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం మందికి ఇండ్లు అవసరం. మనదేశంలో 3.5 కోట్ల ఇండ్లు అవసరం కాగా, వీటిలో ఆర్థికంగా వెనకబడిన (ఈడబ్ల్యూఎస్) వారికి రెండు కోట్లు, అల్పాదాయ గ్రూప్ (ఎల్ఐజీ) ప్రజలకు 1.4 కోట్లు, లోయర్ మిడిల్ క్లాస్‌కు కోటి ఇండ్లు అవసరం. ఒక్కో ఈడబ్ల్యూఎస్ ఇంటికి చదరపు అడుగుకు రూ.1,765 చొప్పున ఖర్చు అవుతుందని నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
అవకాశాలు ఉన్నా..
అఫోర్డబుల్ ఇండ్లకు ప్రభుత్వాలు రాయితీలూ ఇస్తున్నాయి. ఈ సెక్టార్లో పెట్టుబడులకు ప్రైవేటుఫండ్లకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో చవక ధరల ఇండ్ల నిర్మాణం కోసం 2011 నుంచి ఇప్పటి వరకు 2,597 మిలియన్ డాలర్ల విలువైన ప్రైవేటు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి. రెసిడెన్షియల్ సెగ్మెంట్లకు వీటి నుంచి 17 శాతం పెట్టుబడులు వచ్చాయి. అయితే ఇప్పటికీ ప్రైవేటు ఈక్విటీ ఫండ్లు అఫోర్డబుల్ హౌజింగ్‌పై పెద్దగా ఫోకస్ చేయడం లేదు. 2030 నాటికి మనదేశంలో 40 శాతం కంటే ఎక్కువ జనాభా పట్టణాల్లోనే ఉంటారు. దీంతో చవక ఇండ్లకు డిమాండ్ పెరుగుతుంది. ప్రైవేటు ఈక్విటీ కంపెనీలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. అయితే ఈడబ్ల్యూఎస్, ఎల్ఐసీ సెగ్మెంట్లలో ఇన్వెస్ట్మెంట్లు ఇప్పటికీ అంతంతమాత్రమే! తక్కువ మార్జిన్లు రావడమే ఇందుకు కారణమని రియల్టర్లు చెబుతున్నారు.
