
ఆ ఊళ్లో ప్రతి ఇంటికీ విదేశాలతో సంబంధం ఉంది. ఆ గ్రామం నుంచి ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన వేల మంది ఇప్పటికీ దానిని మర్చిపోలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గుజరాత్ ఆనంద్ జిల్లాలోని ధర్మజ్ గ్రామం గురించే. ఇది ప్రస్తుతం దేశంలోనే సంపన్న గ్రామంగా నిలిచింది. అసలు రిచ్ విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది అనటానికి ఈ గ్రామం సాక్ష్యంగా నిలుస్తోంది. 1895లోనే ఆ గ్రామం నుంచి ఉగాండా, మసాచుసెట్స్, ఈడెన్ వంటి ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన యువత ఆ తర్వాత చాలా మందికి ఆదర్శంగా నిలిచింది.
ప్రస్తుతం ధర్మజ్ గ్రామానికి చెందిన 1700 మంది బ్రిటన్ లో, 800 మంది అమెరికాలో, 300 మంది కెనడాలో, 150 మంది ఆస్ట్రేలియాలో ఉండగా న్యూజిలాండ్, ఆఫ్రికా దేశాల్లో కూడా వందల మంది ఉన్నారు. ప్రస్తుతం ధర్మజ్ గ్రామంలో దాదాపు 11వేల మందికి పైగా నివసిస్తున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ స్వగ్రామం అభివృద్ధిపై చూపిన శ్రద్ధ అందరినీ ఆశ్చర్యానికి గురిచేయకమానదు. 2007లో విదేశాల్లో ఉన్న ధర్మజ్ గ్రామస్తులు స్వగ్రామాన్ని అభివ-ృద్ధి చేయాలని నిర్ణయించారు. ఊరంతా ఆర్సీసీ రోడ్లు, చెత్తా చెదారం, మురికి నీరు లేని పరిసరాలతో తీర్చిదిద్దారు.
ఇక గ్రామంలో పబ్లిక్ పార్కు, స్విమ్మింగ్, బోటింగ్ వంటి సౌకర్యాలు తక్కువ రేటుకే అందుబాటులో ఉంచారు. అలాగే ఆ ప్రాంతంలోని గొర్రెలు, మేకలు పెంచుకునే వారికి ఏడాది పొడవునా గడ్డికి ఇబ్బంది లేకుండా భూమిని కూడా ప్రత్యేకంగా కేటాయించారు. ఇక 50 ఏళ్ల కిందటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన గ్రామం.. బ్యాంకింగ్ సేవల్లోనూ ముందుంది. ప్రతి ఇంటిలోనూ ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్లు సర్వసాధారణమే. కేవలం ఆ ఒక్క గ్రామంలోని ప్రజలే అక్కడ ఉన్న 11 వివిధ బ్యాంకుల్లో వెయ్యి కోట్లకు పైగా డబ్బు పెట్టుబడిగా పెట్టారు. దీంతో ఆ గ్రామం రిచ్చెస్ట్ విలేజ్ గా గుర్తింపు తెచ్చుకుంది.
దేశ మాజీ ఆర్థిక మంత్రుల్లో ఒకరైన హెచ్ఎం పటేల్ కూడా ధర్మజ్ గ్రామానికి చెందిన వ్యక్తి కావటం గమనార్హం. ఒక పంచాయితీని ఎంత క్రమపద్ధతిలో నడపాలనే స్టడీకోసం రోల్ మోడల్ గా ఈ గ్రామం నిలిచింది. అందుకే జీవితంలో ఎంత ఎదిగినా పుట్టిన ఊరిని మర్చిపోకూడదని అక్కడి వారు నిర్ణయించుకున్నారు. దీంతో ప్రతి ఏడా జనవరి 12న ధర్మజ్ దివస్ పేరుతో జరిగే కార్యక్రమానికి విదేశాల్లో ఉన్న గ్రామస్తులు తిరిగి వస్తుంటారు.