మ్యూచువల్ ఫండ్స్‌లో 4x15x20 ప్లాన్ ఏంటి..? రూ.కోటి కూడబెట్టాలనుంటే తెలుసుకోండి..?

మ్యూచువల్ ఫండ్స్‌లో 4x15x20 ప్లాన్ ఏంటి..? రూ.కోటి కూడబెట్టాలనుంటే తెలుసుకోండి..?

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీనికి తగినట్లుగానే ద్రవ్యోల్బణం అంటే వస్తువులు సేవల రేట్లు పెరగటం కూడా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో సంపాదించిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేస్తా అంటే అంతకంటే మూర్కపు ఆలోచన మరొకటి ఉండదు. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ రేటు ద్రవ్యోల్బణాన్ని మించి రాబడిని అందించలేదు కాబట్టి. అందుకే అధికా రాబడిని ఇవ్వగల పెట్టుబడుల వైపు డబ్బు పార్క్ చేయటం ముఖ్యం. అందుకే భవిష్యత్తు కోసం లక్షలు సరిపోవు కాబట్టి కనీసం రూ.కోటి కూడబెట్టడం ప్రస్తుతం కనీస రిటైర్మెంట్ అమౌంట్ అయిపోయింది. 

అందుకే చాలా మంది ప్రతినెల క్రమపద్ధతిలో డబ్బును ఎస్ఐపీ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడిగా పెట్టడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఆగస్టులో ఈ రూపంలో పెట్టుబడుల రూ.28వేల 265 కోట్లు జరిగాయి. పెద్ద మెుత్తాన్ని కూడబెట్టడానికి చిన్న అడుగుగా మధ్యతరగతి నుంచి సంపన్న వర్గాల వరకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అయితే మీరు కూడా కోటి రూపాయలు కూడబెట్టే టార్గెట్ కలిగి ఉంటే 4x15x20 ఫార్ములా గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

4x15x20 ఫార్ములా ఎలా పనిచేస్తుంది..?
మీరు 20 ఏళ్లలో కోటి రూపాయలు కూడబెట్టే టార్గెట్ కలిగి ఉంటే మీకు పైన చెప్పిన ఫార్ములా సెట్ అవుతుంది. ఇందుకోసం మీరు ప్రతి నెల మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీ రూపంలో రూ.4వేలు పెట్టుబడిని కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ప్రతి ఏటా మీరు చేసే పెట్టుబడిని కూడా 15 శాతం చొప్పున పెంచటం ముఖ్యం. ఊదాహరణకు మీరు ఈ ఏడాది SIPలలో నెలకు రూ.4వేలు పెట్టుబడి పెడుతున్నట్లయితే.. వచ్చే ఏడాది15 శాతం పెంచి  నెలకు రూ.4,600 పెట్టుబడి పెట్టాలి. ఇలా పెట్టుబడిని క్రమంగా 20 సంవత్సరాల పాటు పెంచుతూ కొనసాగించాలి. ఇక్కడ 12 శాతం వార్షిక రాబడి పరిగణలోకి తీసుకోబడింది. 

ఇలా ప్రతి నెల పైన చెప్పిన పద్ధతిలో పెట్టుబడిని కొనసాగిస్తే చివరికి 20 ఏళ్ల తర్వాత మీరు రూ.కోటి 14లక్షల 39వేల 198 చేతికి అందుకుంటారు. ఈ మెుత్తంలో మీరు పెట్టుబడిగా పెట్టే డబ్బు రూ.49లక్షల 17వేల 292కాగా.. వడ్డీ లేదా లాభం రూపంలో పెరిగే సంపద విలువ రూ.65లక్షల 21వేల 906. అంటే దీర్ఘకాలంలో కాంపౌండింగ్ తన సూపర్ లాభాలను అందించి మీరు కోరుకున్న కార్పస్ చేరుకోవటానికి సహాయం చేస్తుంది.