
బెంగళూరులో ప్రజలకు ఉండే ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రజలు తమ ఇంట్లో ఆఫీసుల్లో గడిపే సమయం కంటే ఎక్కువ ట్రాఫిక్ జామ్స్, రోడ్లపై ట్రాఫిక్ లోనే ఎక్కువ అనటం అతిశయోక్తి కాదు. అయితే రోజురోజుకూ విస్తరిస్తున్న బెంగళూరు నగరంలో ప్రజల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా కొత్త ఆలోచనలతో ముందుకొస్తోంది. మెట్రో కనెక్టివిటీని మెరుగుపరచటం నుంచి కొత్త వంతెనల నిర్మాణం వరకు అన్ని వస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన అంశం వాటి నిర్మాణ వేగమే అంటున్నారు బెంగళూరు ప్రజలు.
అయితే ప్రస్తుతం బెంగళూరులో సిల్క్ బోర్డ్ జంక్షన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ పైనే అందరి చూపు కొనసాగుతోంది. సాధారణంగా ఫ్లైఓవర్ అనగానే కింద పిల్లర్లు వేసి ఒక అంతస్తు మాదిరిగా నిర్మిస్తారు. ఇక్కడ పైన వాహనాలు వెళ్లటంతో పాటు వంతెన కింది ప్రాంతంలో కూడా రోడ్లపై వాహనాలు వెళ్లటానికి రూట్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాదులో ఉండే మెట్రో రైళ్ల మాదిరిగా అన్నమాట. పైన వంతెనపై మెట్రో రైలు వెళుతుంటే కింద రోడ్లపై ప్రజలు సాధారణంగా ప్రయాణిస్తుంటారు.
ALSO READ : స్టేట్ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉందా..?
అసలు ఏంటి డబుబ్ డెక్కర్ ఫ్లైఓవర్ స్పెషాలిటీ..
అయితే బెంగళూరులో నిర్మిస్తున్న డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ మెుదటి అంతస్తులో సాధారణ వాహనాలు ప్రయాణించటానికి వీలుగా నాలుగు లైన్ల రోడ్లు ఉంటాయి. ఇది కింది రోడ్డుకు దాదాపు 8 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. అయితే ఈ వంతెన పైన అంతస్తులో మెట్రో కారిడార్ ఉంటుంది. అంటే అన్నింటి కంటే పైన ఫ్లోర్ మెట్రో రైళ్ల ప్రయాణాల కోసం నిర్మించగా దాని కింద ఫ్లోర్ సాధారణ వాహనాల కోసం ఉంటుంది. వాస్తవానికి బెంగళూరులో ఈ తరహా ఫ్లైఓవర్ నిర్మాణం సిల్క్ బోర్డ్ దగ్గర మెుదటి సారిగా చేశారు. ఈ రూట్ రాగిగుడ్డ ప్రాంతం నుంచి సిల్క్ బోర్డ్ జంక్షన్ మీదుగా ఎల్లో లైన్ లోని మరో మూడు మెట్రో స్టేషన్లను కలుపుకుని వెళుతుంది.
ఈ ఏడాది చివరి నాటికి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని బెంగళూరు అధికారులు చెబుతున్నారు. నిర్మాణంలో ఏర్పడిన కొన్ని చిక్కుల కారణంగా ఇది ఆలస్యం అయినట్లు వారు చెబుతున్నారు. ఈ వంతెనతో ఎలక్ట్రానిక్ సిటీ, హెచ్ఎస్ఆర్ లేఔట్ ప్రాంతాల వైపు ప్రయాణించే వాహనదారులు సిల్క్ బోర్డ్ వద్ద రద్దీని తప్పించుకోగలరని అధికారులు చెబుతున్నారు. మెుత్తంగా ఈ వంతెనను రూ.450 కోట్ల వ్యయంతో 5.12 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఈ వంతెనను బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది. పైగా ఈ వంతెనతో ఎలాంటి సిగ్నల్స్ లేకుండా వాహనదారులు ట్రాఫిక్ నుంచి తప్పించుకుని సులువుగా ప్రయాణం చేయెుచ్చని తెలుస్తోంది.