FASTag News: ఆగస్టు 15లోపు ఫాస్ట్‌ట్యాగ్ ఏడాది పాస్ కావాలా..? కొనటానికి ఇదే సింపుల్ ప్రాసెస్..

FASTag News: ఆగస్టు 15లోపు ఫాస్ట్‌ట్యాగ్ ఏడాది  పాస్ కావాలా..? కొనటానికి ఇదే సింపుల్ ప్రాసెస్..

FASTag Annual Pass: నేషనల్ హైపే కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశంలోని ఎలక్ట్రానిక్ టోల్ చెల్లింపులకు తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్ వ్యవస్థను పర్యవేక్షిస్తుంటుంది. అయితే భారత ప్రభుత్వం ప్రయాణికుల రవాణాను సులభతరం చేసేందుకు ఆగస్టు 15, 2025 స్వాతంత్ర్య దినోత్సవం నుంచి వార్షిక పాస్ సౌకర్యాన్ని తీసుకొస్తుండగా దీనికి అవసరమైన మార్పులను టోల్ ప్లాజాల వద్ద పూర్తి చేస్తోంది. మరో వారం రోజులే గడువు ఉండటంతో అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ మార్పులకు ఆదేశించింది.

 ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ విధానాన్ని గత నెలలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కింద నాన్ కమర్షియల్ వాహనదారులకు ఏడాదిలో 200 ట్రిప్స్ ప్రయాణించేందుకు వీలుగా పాస్ రూపొందించబడింది. దీని ధరను రూ.3వేలుగా కూడా నిర్ణయించబడింది. ఇది వారి ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించటానికి దోహదపడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే ప్రతి సారి తమ ఫాస్ట్‌ట్యాగ్ కార్డులను రీఛార్జ్ చేసుకోవటం, టోల్ ప్లాజాలా వద్ద రద్దీతో పాటు ఆలస్యాలు, టెక్నికల్ తప్పిదాలను తొలగించాలని లక్ష్యంగా  తీసుకురాబడింది ఈ పాస్. 

వార్షిక పాస్ కింద వ్యక్తిగత వాహనాలైన కార్లు, వ్యాన్లు, జీపులకు మాత్రమే అనుమతి ఉంది. ఇక్కడ మరో శుభవార్త ఏంటంటే ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ కలిగిన వ్యక్తులు ఈ పాస్ కోసం ప్రత్యేకంగా కొత్తగా ఎలాంటి అదనపు ఫాస్ట్‌ట్యాగ్ కొనక్కర్లేదు. ఇప్పుడు వాడుతున్న ఫాస్ట్‌ట్యాగ్ ని వార్షిక పాస్ కొనుగోలుకు వాడుకోవచ్చని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ పాస్ కింద ప్రయాణికులు తమ వాహనాలను ఎన్ హెచ్ఏఐ, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కింద ఉన్న నేషనల్ హైవేలు, ఎక్స్ ప్రెస్ వేలపై మాత్రమే పనిచేస్తుంది. స్థానిక టోల్ ప్లాజాలు లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని టోల్ ప్లాజాలకు ఇది వర్తించదని క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 

వార్షిక ఫాస్ట్‌ట్యాగ్ పాస్ ఆగస్టు 15 లోపు ఆన్‌లైన్ ద్వారా ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం..  
* వార్షిక పాస్ ని రాజమార్గ్ యాత్రా యాప్ లేదా ఎన్ హెచ్ఏఐ అధికారిక పోర్టల్ ద్వారా పొందవచ్చు.
* ముందుగా మీ రిజిస్టర్డ్ మెుబైల్ నంబర్ లేదా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి.
* అక్కడ మీ ఫాస్ట్‌ట్యాగ్ ఐడీని అందించగానే అది యాక్టివ్ కండిషన్లో ఉందా, సరిగ్గా అటాచ్ చేయబడిందా, సరైన వాహనానికే దానిని లింక్ చేశారా లేదో సిస్టమ్ చెక్ చేస్తుంది.
* అన్ని నిర్థేశిత ప్రమాణాలకు లోబడి మీ ఫాస్ట్‌ట్యాగ్ ఉంటే వార్షిక పాస్ కొనుగోలుకు డబ్బు చెల్లించేందుకు అనుమతించబడతారు. యూపీఐ, కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ పూర్తి చేయెుచ్చు. 
* పేమెంట్ పూర్తయ్యాక వార్షిక పాస్ ప్రస్తుతం మీ వద్ద ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాలోని వాహనానికి యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే పాస్ యాక్టివేట్ అయినట్లు ఎస్ఎమ్ఎస్ ద్వారా కన్ఫర్మేషన్ కూడా పొందుతారు వాహనదారులు. 

ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన మరో కీలకమైన విషయం ఏంటంటే మీరు వార్షిక పాస్ ఏ రోజు కొన్నప్పటికీ.. దాని యాక్టివేషన్ మాత్రం ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజునే జరుగుతుంది. మీరు పాస్ కొన్న రోజును లెక్కలోకి తీసుకోరన్నమాట. మీరు పాస్ కొనాలనుకుంటున్న వాహనంపై ఏవైనా బకాయిలు ఉన్నా, లేదా వాహనం బ్లాక్ లిస్ట్ అయి ఉన్నా పాస్ పొందలేరని గుర్తుంచుకోండి.