
సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా సవరించిన జీఎస్టీ రేట్లను అన్ని వస్తువులు అలాగే సేవలపై అమలులోకి తెచ్చింది భారత ప్రభుత్వం. ఈ క్రమంలో నవరాత్రికి బంగారం కొనాలనుకుంటున్న వారిలో అసలు బంగారంపై ఎన్ని రకాల పన్నులు ఉన్నాయి.. జీఎస్టీ 2.0లో వాటిని పెంచారా తగ్గించారా అనే అనేక అనుమానాలు ఉన్నాయి. దసరా షాపింగ్ చేయటానికి ముందే వీటిపై క్లారిటీ తెచ్చుకోవటం మంచిది.
బంగారంపై కొత్త జీఎస్టీ రేటు ఎంత..?
ముందుగా బంగారంపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని కొనుగోలుదారులు గుర్తించాలి. ప్రస్తుతం బంగారంపై ఉన్న 3 శాతం పన్ను తొలగింపు లేదా పెంపు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు జీఎస్టీ కౌన్సిల్ ఈ నెల ప్రారంభ సమావేశ సమయంలో. ఫిజికల్ గోల్డ్ మార్కెట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కాబట్టి దీనిలో మార్పులకు ప్రభుత్వం నిరాకరించింది.
మేకింగ్ ఛార్జీలపై జీఎస్టీ పరిస్థితి ఏంటి..?
ముందుగా భౌతిక బంగారంపై 3 శాతం జీఎస్టీ అమలులో ఉండగా.. కొనుగోలుదారులు అదనంగా వస్తువులు లేదా ఆభరణాల మేకింగ్ ఛార్జీలపై కూడా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మేకింగ్ ఛార్జీలు వస్తువు డిజైన్, తయారీ సమయం, బ్రాండ్ వంటి వివిధ కారకాల వల్ల మారుతుంది. అంటే వినియోగదారులు బంగారు ఆభరణం కొన్నప్పుడు మెుత్తంగా రెండు రకాల పన్నులు ఉంటాయి. వీటి విషయంలో ప్రస్తుతం భారత ప్రభుత్వం ఎలాంటి మార్పులు లేకుండా పాత నిబంధనలనే కొనసాగిస్తోంది.
డిజిటల్ గోల్డ్ పై జీఎస్టీ ఎంత..?
బంగారంపై డిజిటల్ రూపంలో కూడా పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిజిటల్ గోల్డ్ పర్చేజెస్ వంటి వాటిపై 3 శాతం జీఎస్టీ అమలులో ఉంది. అయితే సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడుల విషయంలో మాత్రం ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు ఇన్వెస్టర్లు.