చేతికి రూ.42 లక్షలు కావాలా..? నెలకు ఈ పోస్టల్ స్కీమ్‌లో ఎంత దాచుకోవాలో తెలుసా?

చేతికి రూ.42 లక్షలు కావాలా..? నెలకు ఈ పోస్టల్ స్కీమ్‌లో ఎంత దాచుకోవాలో తెలుసా?

దేశంలోని కోట్ల మంది పెట్టుబడి అవసరాల నుంచి ఇన్సూరెన్స్ సహా ఇతర అవసరాల కోసం ఎక్కువగా నమ్మేది పోస్ట్ ఆఫీసు సేవలను. ప్రజలకు తమ గ్రామంలోనే అందుబాటులో ఉండే ఈ ప్రభుత్వ సంస్థ పేద మధ్యతరగతి ప్రజల కోసం అనేక సేవింగ్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో కొంత తక్కువ వడ్డీ వచ్చినప్పటికీ సేఫ్టీ, పెట్టుబడిలో అసలుకు గ్యారెంటీ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ప్రజలు ఎన్ని సంస్థలు ఉన్నా పోస్టాఫీసుల ద్వారా తమ బ్యాంకింగ్ అలాగే సేవింగ్స్ కొనసాగిస్తున్నారు. ఎక్కువగా ఈ ప్రభుత్వ సంస్థ ప్రజల కోసం చిన్న పొదుపు పథకాలను అందిస్తుంటుంది. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పోస్టాఫీసులు అందించే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ గురించే. భారత పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ కింద ఖాతాను తెరవచ్చు. ఖాతాను సింగిల్ గా లేదా ఉమ్మడిగా ముగ్గురు వ్యక్తుల పేరుపై కూడా తెరవటానికి వీలు కల్పించబడింది. 10 ఏళ్లు పైబడిన మైనర్లు కూడా ఈ పథకం కింద ఖాతాను తెరవవచ్చు. అయితే దీనిని సంరక్షకులు నిర్వహించటానికి వీలుంటుంది. కనీసం రూ.100 నుంచి పెట్టుబడిని ఎలాంటి గరిష్ఠ పరిమితులు లేకుండా కొనసాగించవచ్చు. ఐదేళ్లకు మెచ్యూరిటీ అయ్యే ఈ స్కీమ్ కింద ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటును చెల్లిస్తున్నారు. పైగా ఏడాది తర్వాత దీనిపై రుణం కూడా పొందటానికి వీలు కల్పించబడింది. 

42 లక్షలు కూడబెట్టడం ఎలా..?
ఈ రోజుల్లో చాలా మంది నెలకు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్న ఉద్యోగులు వ్యాపారవేత్తలు ఉన్నారు. అలాంటి వారు నెలకు పోస్టల్ డిపార్ట్మెంట్ అందించే రికరింగ్ డిపాజిట్లో రూ.25వేల చొప్పున 10 సంవత్సరాల పాటు సేవ్ చేస్తే వారి పెట్టుబడి విలువ రూ.42లక్షల 71వేల 364 అవుతుంది. ఈ క్రమంలో వారు చేసే పెట్టుబడి రూ.30 లక్షలు కాగా రూ.12లక్షల 71వేల 364 వడ్డీ ఆదాయంగా పొందుతారు. అలాగే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నట్లయితే రూ.12వేల 500 చొప్పున సమానంగా పెట్టుబడి పెడితే పెద్ద కార్పస్ సురక్షితమైన రాబడి గ్యారెంటీతో పొందుతారు.