పిజ్జాకు బ్రాండ్ వేసిన పిజ్జా హట్.. చేతులు మారిన 70 ఏళ్ల చరిత్ర.. ఎన్ని వేల కోట్లకు అమ్మారో తెలిస్తే షాక్..!

పిజ్జాకు బ్రాండ్ వేసిన పిజ్జా హట్.. చేతులు మారిన 70 ఏళ్ల చరిత్ర.. ఎన్ని వేల కోట్లకు అమ్మారో తెలిస్తే షాక్..!

ప్రపంచవ్యాప్తంగా పిజ్జా లవర్స్‌కు అత్యంత పరిచయమున్న బ్రాండ్ 'పిజ్జా హట్' ఇప్పుడు చేతులు మారింది. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానానికి ముగింపు పలుకుతూ.. దీని పేరెంట్ కంపెనీ 'యమ్ బ్రాండ్స్' పిజ్జా హట్‌ను అమ్మేయడానికి సిద్ధమైంది. ఈ మెగా డీల్ విలువ అక్షరాలా 2.7 బిలియన్ డాలర్లు.. అంటే మన భారత కరెన్సీలో సుమారు రూ.25వేల 476 కోట్లు. గత కొన్ని ఏళ్లుగా అమ్మకాలు మందగించడం, తీవ్రమైన పోటీని తట్టుకోలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

యమ్ బ్రాండ్స్ పోర్ట్‌ఫోలియోలో KFC, టాకో బెల్ వంటి పవర్‌ఫుల్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ.. పిజ్జా హట్ మాత్రం గత కొంతకాలంగా వీక్ పర్ఫార్మెన్స్‌తో ఇబ్బంది పడుతోంది. నష్టాలను తగ్గించుకోవడానికి ఇప్పటికే అమెరికాలో దాదాపు 250 స్టోర్లను మూసివేయాలని ప్లాన్ చేశారు. అయితే పిజ్జా హట్‌ను మళ్లీ గాడిన పెట్టాలంటే భారీ పెట్టుబడులతో పాటు మార్పులు అవసరమని, అంత రిస్క్ తీసుకోలేకే దీన్ని అమ్మేయాలని యమ్ బ్రాండ్స్ నిర్ణయించుకుందట.

చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిజ్జా హట్ బిజినెస్‌ను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'లాంగ్‌రేంజ్ క్యాపిటల్' సుమారు రూ.14వేల 153 కోట్లకు కొనుగోలు చేస్తోంది. ఇక చైనాలోని ఆపరేషన్లను మాత్రం 'యమ్ చైనా హోల్డింగ్స్' విడిగా దాదాపు రూ.11వేల 323 కోట్లకు సొంతం చేసుకుంటోంది. ఈ రెండు డీల్స్ కలిపి మొత్తం విలువ రూ.25వేల 476 కోట్లుగా నిలిచింది.

68 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం..

1958లో అమెరికాలోని కాన్సాస్‌లో ప్రారంభమైన పిజ్జా హట్.. ఒకప్పుడు పిజ్జా మార్కెట్‌ను శాసించింది. కానీ మారుతున్న కస్టమర్ల అభిరుచులు, డిజిటల్ ఆర్డరింగ్ సిస్టమ్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ స్పీడ్‌ను అందుకోవడంలో ఈ బ్రాండ్ వెనుకబడింది. పాతకాలపు స్టోర్ ఫార్మాట్లు కూడా దీనికి మైనస్ అయ్యాయి. అయితే కొత్త ఓనర్ల ఆధ్వర్యంలో సరికొత్త టెక్నాలజీతో.. ఆధునిక స్టోర్లతో పిజ్జా హట్ మళ్లీ కంబ్యాక్ ఇస్తుందని కంపెనీ సీఈఓ క్రిస్ టర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. చూద్దాం మరి.. రాబోయే రోజుల్లో పిజ్జా హట్ బిజినెస్ స్టోరీ ఎలాంటి క్రేజీ టర్న్ తీసుకుంటుందో.