India Vs Pak: పాక్ నుంచి ఇండియా ఏవేవి దిగుమతి చేసుకుంటోంది..? ఇకపై ఎలా..

India Vs Pak: పాక్ నుంచి ఇండియా ఏవేవి దిగుమతి చేసుకుంటోంది..? ఇకపై ఎలా..

Trade Ban on Pakistan: ప్రస్తుతం దాయాది దేశం పాకిస్థాన్ భారత ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వాస్తవానికి 2019లో పుల్వామా దాడి నాటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింతగా దిగజారింది. అప్పటి నుంచి పాక్ నుంచి చేసుకునే దిగుమతులపై ఏకంగా 200 శాతం సుంకాలను భారత ప్రభుత్వం అమలు చేసింది. అలాగే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్థానాన్ని ఇండియా తొలగించింది.

అప్పటి నుంచి భారత్ క్రమంగా పాకిస్థాన్ వస్తువుల దిగుమతులను తగ్గిస్తూ వచ్చింది. అధికారిక డేటా ప్రకారం ఏప్రిల్ 2024 నుంచి జనవరి 2025 మధ్య కాలంలో పాక్ నుంచి భారత్ 4లక్షల 20వేల డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుందని తేలింది. ఇందులో పండ్లు, సిమెంట్ సహా అనేక ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. అసలు ఇండియా పాక్ నుంచి ఏఏ వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందనే వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

Also Read : ఇండియన్ యూట్యూబర్స్ సంపాదన

* సిమెంట్, నిర్మాణ సామాగ్రి
* పత్తి, యార్న్, సిల్క్ వేస్ట్ 
* ఖర్జూరం, మామిడి పండ్లు, డ్రైఫ్రూట్స్, ఉల్లి, టమాటా
* డిప్సమ్, రాక్ సాల్ట్, లెథర్, ఫార్మా రంగంలో వినియోగించే కెమికల్స్
* క్రికెట్ బ్యాట్లు, గ్లౌజులు, బాల్స్ 

* సర్జికల్ టూల్స్

కొన్నేళ్ల కిందట భారత్ ఎక్కువగా రాతి ఉప్పు కోసం పాకిస్థాన్ మీద ఆధారపడేది. పొరుగుదేశంలో అది తక్కువ ధరకు దొరకటమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. అయితే దాదాపు దశాబ్ధకాలంగా వాణిజ్య సంబంధాలు చెడిపోవటంతో ఇండియా దీని దిగుమతులను పాక్ నుంచి తగ్గించి.. యూఏఈ, ఇరాన్, మలేషియా, జర్మనీ, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఆస్ట్రేలియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. 

అలాగే ఇండియా నుంచి అట్టారి మార్గం ద్వారా పాకిస్తాన్‌కు సోయాబీన్, కోళ్ల దాణా, కూరగాయలు, ఎర్ర మిరపకాయలు, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్, ప్లాస్టిక్ నూలు వంటి వస్తువులు ఎగుమతి అవుతుంటాయి. అయితే తాజా వాణిజ్య పరిస్థితుల్లో ఇవి పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.