ధరణిలో లొసుగులున్నయ్​..: కోదండ రెడ్డి

ధరణిలో లొసుగులున్నయ్​..: కోదండ రెడ్డి
  • సీఎంకు ఆధారాలు పంపినా స్పందించలే : కోదండ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ధరణిలో లొసుగులున్నాయని కిసాన్​ కాంగ్రెస్​ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. అందువల్లే తాము అడిగిన ప్రశ్నలకు సర్కారు సమాధానం ఇవ్వడం లేదని విమర్శించారు. అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపేందుకే ధరణిని తెచ్చామని సీఎం అంటున్నారని, కానీ అందులో అన్నీ లోపాలే ఉన్నాయన్నారు. వాటిని ఆధారాలతో సహా సీఎంకు పంపించినా స్పందించడం లేదన్నారు. బుధవారం పీసీసీ అధికార ప్రతినిధులు కల్వ సుజాత, కృష్ణతేజతో కలిసి గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ధరణి కారణంగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎన్నో రికార్డులు తారుమారు చేశారన్నారు. సీఎం నియోజకవర్గంలో 1,500 ఎకరాల అసైన్డ్​ భూములను చట్ట విరుద్ధంగా ఇతరులకు అప్పగించారని చెప్పారు. 600 ఎకరాలు అమూల్​ కంపెనీకి, 50 ఎకరాలు గంగుల కమలాకర్​కు ఇచ్చారని వెల్లడించారు. ఓఆర్ఆర్​పై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రి వివరణ ఇవ్వాలని, కానీ ఓ అధికారి ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ‘అరవింద్​ కుమార్​ అవినీతి ఆఫీసర్’​ అని కోదండ రెడ్డి ఫైర్​ అయ్యారు. మధ్యప్రదేశ్​లో కేసీఆర్​, కవిత ప్రస్తావనను ప్రధాని మోదీ ఎందుకు తీసుకొచ్చారని కల్వ సుజాత ప్రశ్నించారు. కవిత లిక్కర్​ స్కామ్​లో ఇరుక్కుంటే కాపాడుతున్నదెవరని నిలదీశారు. ఆమెను అరెస్ట్​ చేయకుండా ఆపింది బీజేపీ కాదా? అని ప్రశ్నించారు. ఓట్ల పోలరైజేషన్​ కోసమే యూనిఫాం సివిల్​ కోడ్​ను తెరపైకి తీసుకొచ్చారని కృష్ణ తేజ అన్నారు.