
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దోపిడీ నుంచి రైతులను కాపాడేందుకు ప్రభుత్వం మనీ లెండింగ్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఈ చట్టం రైతులకు రక్షణగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని కోదండరెడ్డి వివరించారు.
అసలు, వడ్డీలు చెల్లించలేక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనీ లెండింగ్ యాక్ట్–1349 రాష్ట్రంలో సరిగా అమలు కావడం లేదని, రెండు నెలల క్రితం ఆధారాలతో సహా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రైతు కమిషన్ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మనీ లెండింగ్ యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిందన్నారు.
రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్ కుమార్ జారీ చేసిన ఈ ఉత్తర్వులు రైతులకు రక్షణ కవచంగా మారనున్నాయని ఆయన అన్నారు. ప్రధానంగా సన్నకారు, చిన్నకారు రైతులు, కౌలు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చేతుల్లో మోసపోతున్నారని, ఇకపై వారి ఆటలు సాగవని తెలిపారు.