హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితిని మరోసారి పదేండ్లు పొడిగించాలని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ప్రభుత్వానికి విన్నవించారు. ఈ మేరకు వారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేర్వురుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యమ కాలంలో పదేండ్ల పాటు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదని.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ప్రభుత్వం కూడా పదేండ్ల కాలంలో ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసిందని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ 20 ఏండ్ల కాలంలో సరైన నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయి, అర్హత కోల్పోయి తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి అని, ఈ నేపథ్యంలో అభ్యర్థులు నష్టపోకుండా ఉండాలంటే భవిష్యత్తులో విడుదలయ్యే అన్ని నోటిఫికేషన్లలో వయోపరిమితిని పెంచాలని కోరారు. తద్వారా వేలాది మంది యువత ఉపాధి పొందే అవకాశం లభిస్తుందని వారు వివరించారు.
ఈ విన్నపంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని, నిరుద్యోగులకు సంబంధించిన ఈ సమస్య గురించి లోతుగా చర్చించారని తెలిపారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం వయోపరిమితి సడలింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ తెలిపారు.
