
తొర్రూరు, వెలుగు : తెలంగాణ ఆత్మగౌరం, సీఎం కేసీఆర్ అహంకారానికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఈసారి కేసీఆర్‌ను ఓడించి ఫాంహౌజ్‌కే పరిమితం చేయాలని టీజేఎస్ చైర్మన్ కోదండరాం ఓటర్లకు పిలుపునిచ్చారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో తెలంగాణ పీపుల్స్జేఏసీ, తెలంగాణ సమాఖ్య -జాగో తెలంగాణ, భారత్ బచావో సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఓటరు చైతన్య సదస్సులో కోదండరాం మాట్లాడారు.
ఎందరో అమరల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు కేసీఆర్ కుటుంబ పాలనలో మగ్గిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రశ్నించే వారిని అణచివేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ కరెక్టుగా లేదన్నందుకే తనపై కక్షసాధింపు చేసి దూరం పెట్టారని తెలిపారు. బాధ్యత గల పదవిలో ఉండి ప్రజలకు ఉపయోగపడని పథకాలు ప్రవేశపెట్టి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ దుబారా చేశారని మండిపడ్డారు. ‘‘రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.50 లక్షల కోట్లకు పెంచి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టాడు.
ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా పదేళ్లుగా నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నాడు. పేపర్లీకేజీలపై ఒక్కమాట కూడా మాట్లాడని మంత్రి కేటీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నోటిఫికేషన్లు వేస్తామనడం సిగ్గుచేటు. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలి” అని కోదండరాం పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనీ, రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్లు హరగోపాల్, నిరూప్, గోపీనాథ్, సీనియర్ జర్నలిస్టు యాదగిరి, ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.