తెలంగాణ వ్యతిరేకిని గవర్నర్​గా నియమించే కుట్ర: కోదండరాం

తెలంగాణ వ్యతిరేకిని గవర్నర్​గా నియమించే కుట్ర: కోదండరాం
  • అప్రమత్తతతో అభివృద్ధిని సాధిద్దాం: కోదండరాం 
  • షాద్ నగర్​లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ 

షాద్ నగర్, వెలుగు: తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా కోదండరాం ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..తెలంగాణ వ్యతిరేకిని రాష్ట్ర గవర్నర్ గా నియమించేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఇప్పుడు పోరాటం జరగాల్సిన అవసరముందని..అదే ఇప్పుడు సుదీర్ఘ ఉద్యమమని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణకు వచ్చే కష్టాలను ప్రొఫెసర్ జయశంకర్ గతంలోనే వివరించారని గుర్తుచేశారు. బొగ్గు వేలంపాట మంచిది కాదన్నారు.  

బొగ్గు వేలాన్ని దక్కించుకున్న కార్పొరేట్ సంస్థలు, బడా వ్యాపారవేత్తలు ఈ ప్రాంతాన్ని జల్లెడ పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని పల్లెల్లో చిచ్చు రగులుతుందని.. ప్రకృతి విధ్వంసం జరుగుతుందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో మామిడి సాగు జరగదన్నారు. వేలం పాటతో ఆదానీ, అంబానీ లాంటి వాళ్లు బొగ్గు గనులను దక్కించుకొని విధ్వంసం చేయడం తప్ప ప్రజల బతుకు మెరుగుపడదని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. 

జయశంకర్ ను కేసీఆర్ అవమానించాడు: వీర్లపల్లి శంకర్

ప్రొఫెసర్ జయశంకర్ ను కేసీఆర్ ఎన్నోసార్లు అవమానించారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఎన్నో త్యాగాలు చేసిన జయశంకర్.. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. అలాంటి వ్యక్తికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఎన్నో అవమానాలకు గురిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, జనార్ధన్, అర్జునప్ప తదితరులు పాల్గొన్నారు.