బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ: కోదండరాం

బీజేపీ అనుబంధ సంస్థలుగా ఈడీ, సీబీఐ: కోదండరాం
  •     లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి: కోదండరాం 
  •     రాజ్యాంగం.. బీజేపీ సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నరు: హరగోపాల్

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ బద్ధ సంస్థలను కుప్పకూల్చిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఈడీ, సీబీఐ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నాయని, బీజేపీ అనుబంధ విభాగాలుగా తయారయ్యాయని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలను పునరుద్ధరించాలని  కోరుతుంటే ఏకంగా రాజ్యాంగాన్నే సమూలంగా మార్చాలన్న అభిప్రాయంతో బీజేపీ ఉందని కోదండరాం విమర్శించారు. శనివారం హైదరాబాద్​ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీలో టీజేఎస్ ఆధ్వర్యంలో "ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం.. మనమేం చేద్దాం" అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. వీక్షణం ఎడిటర్ నాగసూరి వేణుగోపాల్, రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ కన్నెగంటి రవి, ప్రొఫెసర్లు పీఎల్ విశ్వేశ్వరరావు, నర్సింహారెడ్డి, వెంకటనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వంలో కార్పొరేట్ శక్తుల జోక్యం పెరిగిందని, దీంతో ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన అన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు అడ్డుకట్ట వేయాలని.. ఇందుకు అందరం ప్రజా సంఘాలతో కలిసి ఓటర్లలో చైతన్యం తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ గెలుపు దేశ ప్రయోజనాలకు ఎంతో అవసరమని.. రాబోయే లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ ను గెలిపించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. 

రాజకీయాలే సమస్యగా మారాయి

సమస్యలను పరిష్కరించాల్సిన రాజకీయాలే సమస్యగా మారాయని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. రాజ్యాంగం మనది కాదు.. కేవలం బీజేపీదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఆర్బీఐ మాజీ గవర్నర్ మాట్లాడుతూ.. అసమానతలు ఉంటాయి.. వాటితో వచ్చిన సమస్యలు ఏంటని అన్నారని ఆయన గుర్తుచేశారు. ఓటు హక్కు ద్వారా వచ్చిన సమానత్వం.. ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వానికి దారి తీయకపోతే ఏం లాభమని హరగోపాల్​ప్రశ్నించారు. రాజ్యాంగం ఒక విప్లవాత్మకమైన డాక్యుమెంట్ అని,  ప్రస్తుతం రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. బీజేపీది ప్రమాదకరమైన భావజాలమని, ఈ ఎన్నికల్లో గత పదేండ్లలో దేశ ప్రజలకు జరిగిన నష్టాన్ని అందరికీ వివరించాలని హరగోపాల్ కోరారు. సబ్ కా సాథ్​ సబ్ కా వికాస్ అని నిత్యం చెప్పే బీజేపీ పాలనలో దేశం హ్యుమన్ డెవలప్ మెంట్ ఇండెక్స్ లో 140వ స్థానంలో ఉందని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరారావు  గుర్తు చేశారు.  గత పదేండ్లలో ఏ ర్యాకింగ్ లో చూసినా మన దేశం దిగజారుతోందని, దేశాన్ని బీజేపీ పాలకులు నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.