సర్కారు స్కూళ్లను బలోపేతం చేద్దాం : కోదండరాం

సర్కారు స్కూళ్లను బలోపేతం చేద్దాం : కోదండరాం
  • వాటిపై ప్రజల్లో విశ్వాసం కలిగించే బాధ్యత టీచర్లదే: కోదండరామ్​ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల బలోపేతానికి టీచర్లు మరింత కృషి చేయాలని టీజేఎస్ చీఫ్‌‌‌‌ ప్రొఫెసర్ కోదండరామ్​ అన్నారు. బదిలీలు, పదోన్నతుల ద్వారా బడుల్లోని ఖాళీలను ప్రభుత్వం నింపే ప్రయత్నం చేసిందన్నారు. ఆదివారం స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూ) ఆఫీసులో సంఘం రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ‘తెలంగాణ ఉద్యమం– ఉపాధ్యాయుల పాత్ర’అనే అంశంపై కోదండరామ్ మాట్లాడారు. సర్కారు బడులపై ప్రజల్లో మరింత విశ్వాసం కలిగించే బాధ్యత టీచర్లదేనన్నారు. అలాగే, విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేయాలని కోరారు. 

విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అర్హులైన టీచర్లకు జూనియర్ లెక్చరర్, ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ ప్రమోషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పర్వత్ రెడ్డి, సదానందం గౌడ్ మాట్లాడుతూ.. పెండింగ్‌‌లో ఉన్న టీచర్ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టినట్లు సీపీఎస్‌‌ను రద్దు చేసి, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని సర్కార్‌‌‌‌ను కోరారు. పెండింగ్‌‌లో ఉన్న డీఏలను రిలీజ్ చేయాలన్నారు. ప్రతి స్కూల్లో సర్వీస్ పర్సన్ నియమించాలని, 40 శాతం ఫిట్‌‌మెంట్‌‌తో కొత్త పీఆర్సీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ‘ఉద్యమ ప్రస్థానం’పుస్తకాన్ని కోదండరాం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఆట సదయ్య, గజేందర్, ఏవీ సుధాకర్, ప్రసాద్, పోల్ రెడ్డి, నీరజ, శిరీష తదితరులు పాల్గొన్నారు.